గడ్కరీ మాటలకు అర్థాలే వేరులే!

Nitin Gadkari Jockeying For Prime Minister Post - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎవరయితే ఇంటిని చక్కదిద్దు కోలేరో వారిక దేశాన్ని ఎలా చక్కదిద్దుతారు? కనుక మీరు ముందుగా మీ కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టండి!’ అని బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఫిబ్రవరి రెండవ తేదీన ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ప్రజలు తమను కలల్లోకి తీసుకెళ్లే నాయకులను ఇష్ట పడతారు. ఒకవేళ వారి కలలను నెరవేర్చడంలో నాయకులు విఫలమయితే వారిని పట్టుకొని ప్రజలు కొడతారు. కనుక మీరు నెరవేర్చగల హామీలను మాత్రమే ఇవ్వండి’ అని జనవరి 28వ తేదీన ముంబైలో బీజేపీ అనుబంధ రవాణా సంఘం ‘నవభారతీయ శివ్‌ వాహతుక్‌ సంఘటన’ సమావేశంలో గడ్కారీ వ్యాఖ్యానించారు.

‘సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదు. రాజకీయ నాయకులకు పరిమితులు ఉంటాయి. కనుక వారు విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరాదు’ అంటూ జనవరి 13వ తేదీన మహారాష్ట్రలోని యవత్మల్‌లో జరిగిన 92వ అఖిల భారతీయ మరాఠి సాహిత్య సమ్మేళనం’లో గడ్కారీ వ్యాఖ్యానించారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళా సాధికారికతకు నిదర్శనం. మహిళలకు రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ రాజకీయల్లో రాణించారు’ అని జనవరి ఏడవ తేదీన నాగపూర్‌లో జరిగిన స్వయం ఉపాధి మహిళా బృందాలను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అదే సమావేశంలో ఆయన కుల, మత రాజకీయాలను విమర్శించారు. ‘ఎవరైనా జ్ఞానం ప్రాతిపదికనే ఎదగాలి. సాయిబాబా, గజానన్‌ మహరాజ్‌ లేదా సంత్‌ తుక్దోజీ మహరాజ్‌ను మీది ఎమతమని అడుగుతామా? ఛత్రపతి శివాజీ మహరాజ్, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ లేదా జ్యోతీబా ఫూలేలను మీ కులం ఏమిటని అడుగుతామా?’

‘నేనే పార్టీ అధ్యక్షుడిని అయితే నా ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయక పోతే ఎవరిది బాధ్యత ? నాదే బాధ్యత’ అని డిసెంబర్‌ 25వ తేదీన ఢిల్లీలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులతో మాట్లాడుతూ గడ్కరీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ  వ్యాఖ్యలు చేశారు. ‘సహనం పాటించడం భారత ప్రజలకున్న పెద్ద సంపద. భారత్‌ ఓ దేశం కాదు, ఓ జాతంటూ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు నాకిష్టం’ అని ఆయన అన్నారు. ‘ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని తీసుకరాకపోతే నీవు అధికారంలోకి వచ్చినా ఒక్కటే అధికారం కోల్పోయినా ఒక్కటే’ అని అన్నారు.

అంతకుముందు డిసెంబర్‌ 22వ తేదీన పుణెలో జరిగిన జిల్లా పట్టణ కోపరేటివ్‌ బ్యాంకుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పరాజయాన్ని ఒప్పుకునే సంస్కారం పెరగాలి’ అని అన్నారు. అక్టోబర్‌లో బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌కు ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘బీజేపీ ఎన్నికలకు ముందు నెరవేర్చడం సాధ్యంకాని హామీలను ఇచ్చింది. రాజకీయాలనేవే తప్పనిసరి ఆడాల్సిన ఓ ఆట. దానికి పరిమితులుంటాయి. వైరుధ్యాలు కూడా ఉంటాయి. మేము ఎప్పటికీ అధికారంలోకి రామని గట్టిగా భావించాం. అయితే అసాధ్యమైన హామీలు ఇవ్వాల్సిందిగా మా వారు మాకు సూచించారు. ఎన్నికయినా వాటిని ఎలాగు నెరవేర్చలేం. అయితే సమస్య ఏమి వచ్చిందంటే, జనం ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. డేట్లతో సహా మేమిచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. చిద్విలాసంగా నవ్వుతూ ముందుకు పోతున్నాం అంతే’ అని వ్యాఖ్యానించారు.

గడ్కరీ గతేడాది కాలంగా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ పరమైనవని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను ఉద్దేశించి చేసినవే ఎక్కువన్న విషయం స్పష్టం అవుతోంది. ‘ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు దేశాన్ని ఏం చక్కదిద్దుతాడు’ అన్న వ్యాఖ్య భార్యను విడిచిపెట్టిన మోదీని ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రజల జీవితాలను బాగు చేయలేని వాడు అధికారంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటేనని అనడం, అసాధ్యమయ్యే హామీలను ఇవ్వడం (సబ్‌కే సాత్‌ సబ్‌కా వికాస్‌) తప్పని చెప్పడం, ఎన్నికల్లో ఓడిపోతే అందుకు బాధ్యత వహించాల్సిందనడం మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. ఓటమికి పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యత అనడం అమిత్‌ షాను ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ఇక కుల, మతాల గురించి, దేశ ప్రజల సహనం గురించి, ఇందిరా, నెహ్రూల గురించి మాట్లాడడం పార్టీ వైఖరిని దూషించినట్లుగా కనిపిస్తోంది.

ఇక విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసరం అనడం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకుడు రాజ్‌ థాక్రే అభ్యంతరం మేరకు ప్రముఖ సాహితీవేత్త నయన్‌తార సహగల్‌ను మహారాష్ట్ర సాహిత్య సమ్మేళనానికి నిర్వాహకులు ఆహ్వానించకపోవడంపై వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోదీని పరోక్షంగా విమర్శించడం ద్వారా పార్టీలో తాను ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగాలనుకోవడం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే మిత్రపక్షాలను ఆకర్షించే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఎదగాలనుకోవడం, ఇక ఇందిరా, నెహ్రూలు, ప్రజల సహనం గురించి మాట్లాడం అంటే తాను మోదీ లాంటి నియంతృత్వ వాదిని కాదని, ప్రజల మనిషినని, నిబద్ధత కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవడం కావచ్చు.

అయితే ఇలాంటి అన్వయింపులను గడ్కరీ కొట్టి వేస్తున్నారు. మీడియా అసందర్భంగా తన వ్యాఖ్యలకు ఉటంకిస్తోందని ఆరోపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి, తనకు మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాలు పడిపోవడానికి పార్టీ నాయకులు నియంతృత్వ పోకడలే కారణమని, ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించి గడ్కారీని నియమించాలంటూ ఆరెస్సెస్‌ నాయకుడు మోహన్‌ భగవత్, ప్రధాన కార్యదర్శి సురేశ్‌ జోషిలకు డిసెంబర్‌ నెలలో ‘వసంత్‌రావు నాయక్‌ సేథి స్వావలంబన్‌ మిషన్‌’ చైర్‌పర్సన్‌ కిషోర్‌ తివారీ మరి ఎందుకు లేఖ రాశారో? పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గడ్కరీకి ఇప్పటికీ ఆరెస్సెస్‌ అండదండలున్న విషయం తెల్సిందే.


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top