రాజకీయ నాయకులకు సలహా ఇచ్చిన నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman Advise To Politicians Apply Mind Before You Speak - Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు మహిళా నేతల గురించి అడ్డమైన చెత్త వాగుడు వాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయంపై ఇంతవరకూ అధికార పార్టీతో సహా ఇతర పార్టీ ముఖ్య నాయకులేవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయంపై స్పందించడమే కాక.. నాయకులు కాస్తా బుర్ర పెట్టి స్పృహలో ఉండి మాట్లాడితే మంచిదంటూ సూచించారు. ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విధంగా మాట్లాడారు.

‘చర్చలో భాగమైనా కాకపోయిన ఓ మహిళ గురించి కామెంట్‌ చేయడం చాలా ఈజీ. ఓ వర్గానికి చెందిన వారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా సులువు. ఇలాంటివి చూసినప్పుడు కనీస ఆలోచన లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. అందుకే అందరికి చెప్పేదొకటే.. మాట పెదాలను దాటకముందే దాని గురించి కాస్తా బుర్ర పెట్టి ఆలోచిస్తే మంచిది. ఇలాంటి మాటలు మాట్లాడి మన ముందు తరాలకు ఏం సందేశం ఇస్తున్నాం అనే విషయాన్ని మైండ్‌లో ఉంచుకుని మాట్లాడితే మంచిద’ని సూచించారు. ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్‌.. జయప్రద గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దీని గురించి దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోన్నప్పటికి.. ఆ పార్టీ నాయకులు ములాయం సింగ్‌ కానీ, అఖిలేష్‌ యాదవ్‌ కానీ స్పందించకపోవటం గమనార్హం. అదే విధంగా కాంగ్రెస్‌ నాయకుడు శశి థరూర్‌ని పరామర్శించటం గురించి నిర్మలా సీతారామన్‌ని ప్రశ్నించగా.. ‘నేను విమానాశ్రయానికి తిరిగి వెళ్తున్నాను. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న శశి థరూర్‌ని పరామర్శిస్తే బాగుంటుంది అనిపించిది. అందుకే ఆస్పత్రికి వెళ్లాను. దీని గురించి నా పార్టీకి చెందిన వ్యక్తులతో సహా ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రచారంలో భాగంగా శశి థరూర్‌కి ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిదే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top