‘రాజ్యసభ డిప్యూటీ’ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం

NDAs Harivansh Narayan Singh wins as Rajya Sabha Deputy Chairman - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కోసం జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. రాజ్యసభలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు అనుకూలంగా 125, ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి.  ఫలితంగా హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ విజయం సాధించారు.

 రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244 కాగా, 230 సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికార, విపక్షాల మధ్య ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌నే విజయం వరించింది. విపక్షాల తరపున బరిలోకి దిగిన కాంగ్రెస్‌ ఎంపీ హరిప్రసాద్‌ నుంచి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు తీవ్ర పోటీ ఎదురైందనే చెప్పాలి. పలుమార్లు లెక్కించిన ఓట్లలో హరిప్రసాద్‌ 20 ఓట్ల  తేడాతో ఓటమి పాలయ్యారు.  ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు అనుకూలంగా టీఆర్‌ఎస్‌ ఓటేయగా,  కాంగ్రెస్‌ ఎంపీ హరిప్రసాద్‌కు టీడీపీ ఓటేసింది.

వైఎస్సార్‌సీపీ దూరం

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కోసం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు కానీ, విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ ఎంపీ కె. హరిప్రసాద్‌కు గానీ వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్‌, బీజేపీలు రెండు ఏపీకి తీరని ద్రోహాన్ని చేసిన కారణంగా  రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top