కశ్మీర్‌ ముఖచిత్రాన్ని, తలరాతను మార్చబోతున్నాం!

Narendra Modi government will change fate of Kashmir, says Rajnath Singh - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ ముఖచిత్రాన్ని, తలరాతను నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిగా మార్చబోతోందని, అయితే, యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. శ్రీనగర్‌లో గురువారం జరిగిన క్రీడా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంటే ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

‘ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా సాగుతున్న రాష్ట్ర చీకటి చరిత్రలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మేం రాష్ట్రంలోని యువతకు, క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌ యువత క్రీడల్లో అద్భుతాలు సాధించడం ద్వారా, చదువుల్లో రాణించడం ద్వారా తమ భవిష్యత్తును తీర్చిద్దిద్దుకోవడమే కాదు.. రాష్ట్ర భవిష్యత్తును మార్చనున్నారని నేను నమ్ముతున్నా’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాల నుంచి దాదాపు మూడువేలమంది క్రీడాకారులు, విద్యార్థులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2016లో వరల్డ్‌ కిక్‌బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ గెలుపొందిన తాజముల్‌ ఇస్లాం అనే కశ్మీరీ బాలికను హోంమంత్రి రాజ్‌నాథ్‌ సన్మానించారు. ఈ సందర్భంగా తాజముల్‌ ఆత్మీయంగా రాజ్‌నాథ్‌ను ఆలింగనం చేసుకోవడమే కాదు.. ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోపాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top