బాల్య వివాహం చేస్తే జైలుకే..

Nannapaneni Rajakumari Fires OnChild Marriages - Sakshi

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి హెచ్చరిక

పెదపాడు: బాల్య వివాహం నేరమని.. అలా చేసిన తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని రాష్ట్ర మహిళా విభాగం చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని ఆర్టీసీ కాలనీలో ఓ బాలికకు వివాహం చేస్తున్నారని తెలియడంతో బుధవారం నన్నపనేని రాజకుమారి పిల్లల కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికకు తల్లిదండ్రులు లేరని తాము పెంచుకుంటున్నామని పెద్దమ్మ, పెద్దనాన్న ప్రతాప వైదేహీ, లక్ష్మీనారాయణ ఆమెకు చెప్పారు. బాలికకు వివాహం చేయలేదని తమ కుటుంబంలో ముందుగా నిశ్చయించుకుని మైనార్టీ తీరిన తర్వాత వివాహం చేస్తామని లక్ష్మీనారాయణ దంపతులు సమాధానమిచ్చారు. ఈరోజుల్లో అలాంటివి ఎక్కడా చేయడం లేదని, 18 ఏళ్లు నిండేవరకు వివాహం చేయరాదని నన్నపనేని వారిని హెచ్చరించారు.

బాలికను చదివించలేని పక్షంలో తాము ప్రభుత్వ హస్టల్స్‌ లేదా మహిళా హాస్టల్‌లో ఉంచి చదివిస్తామని చెప్పారు. బాలిక అభిప్రాయం కోరగా పెదనాన్న వద్ద ఉంటానని, పాఠశాలకు వెళ్తానని సమాధానమిచ్చింది. బాలుడు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికకు మైనార్టీ తీరందని చెప్పి తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు. బాలిక కుటుంబం పురోభివృద్ధికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా సాయమందేలా చర్యలు తీసుకుంటామని నన్నపనేని రాజకుమారి హామీఇచ్చారు. ఇరువర్గాలనుంచి మైనార్టీ తీరేవరకూ వివాహం చేయమంటూ రాతపూర్వక హామీని తీసుకోవాలని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసరావును ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు  శిరిగినీడి రాజ్యలక్ష్మి, సెక్షన్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ విజయకుమారి, సీడీపీఓ గిరిజ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top