మంత్రి బెదిరిస్తే భయపడం

MP YS Avinashreddy fires on Minister Adinarayana Reddy - Sakshi

     కార్యకర్తలను కాపాడుకుంటాం

     ఎంపీగా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉంది

     పోలీసులు మంత్రి తొత్తులు:ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

జమ్మలమడుగు: వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని,  దాడులనుంచి తమ కార్యకర్తలను కాపాడుకుంటామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబుతో కలిసి ఆయన పెద్దదండ్లూరు గ్రామానికి వస్తుండగా.. వీరిని చౌడురు బైపాస్‌ వద్ద పోలీసులు ప్రత్యేక బలగాలతో అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా ఏ గ్రామంలోనైనా పర్యటించే హక్కు తనకుందని, మంత్రి ఆదినారాయణరెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్న  పోలీసులు తనను అడ్డుకుంటున్న తీరు దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. తాము పెద్దదండ్లూరు గ్రామానికి వెళ్లి తమ వారిని కలవడానికి ప్రయత్నం చేస్తే.. పోలీసులు దారిలోనే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామంలోని తమ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులను కాకుండా.. తమను అడ్డుకోవడం పోలీసుల పక్షపాత ధోరణికి అద్దం పడుతుందని మండిపడ్డారు.

ఆదినారాయణరెడ్డి తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు, మంత్రి కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. కాగా ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడపకు తరలించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top