‘టీఆర్‌ఎస్‌లో ఓనర్ల చిచ్చు మొదలైంది’ | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌కు చింతమడకపై ఉన్న ప్రేమ ముంపు గ్రామాలపై లేదు’

Published Fri, Aug 30 2019 5:38 PM

MP Bandi Sanjay Fires On CM KCR - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల :  సీఎం కేసీఆర్‌కు చింతమడకపై ఉన్న ప్రేమ ముంపు గ్రామాలపై ఎందుకు లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మిడ్‌మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడతూ.. మిడ్‌మానేరు నిర్వాసితులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. పరిహారం వచ్చే వరకు జెండాలు పక్కకు పెట్టి పోరాటం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ తన సొంత గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఇస్తామని చెబుతున్నారు కానీ ముంపుకు గురైన కుటుంబాలకు మాత్రం నయా పైసా ఇవ్వడం లేదని విమర్శించారు. చావుకైనా తెగబడి మరోసారి మలిదశ ఉద్యమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

ధర్నాలతో కాకుండా ప్రగతి భవన్‌ను ముట్టడించి కేసీఆర్‌ సంగతేంటో చూద్దామన్నారు.  సీఎం కేసీఆర్‌ మిడ్‌మానేరు ప్రాంతానికి వస్తే ప్యాకేజీతోనే రావాలని లేదంటే తమ తడాఖా ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్ల చిచ్చు మొదలైందని, దీనికి మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మంత్రి ఈటలకు దమ్ముంటే రాజీనామా చేసి బయటకు రావాలని సవాల్‌ చేశారు. రెండు పడకల ఇళ్లకోసం ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్రం నుంచి మంజూరు చేయించి తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ సంజయ్‌ హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement