పంచాయతీల్లో మహిళలకే అగ్రపీఠం

More than half of number of posts are reserved for Women in panchayats - Sakshi

‘స్థానిక’ పదవుల్లో సగానికిపైగా అక్కచెల్లెమ్మలకు రిజర్వు

1,55,629 పదవులకు గాను 79,485 పదవులు కేటాయింపు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్దపీట వేసింది. మొత్తం పదవుల్లో సగానికి పైగా మహిళలకే రిజర్వు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్ష, జెడ్పీ చైర్మన్‌ పదవులతో పాటు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల్లోనూ సగం స్థానాలను మహిళలకు కేటాయించింది. ఆయా పదవుల రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం మంగళవారమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. మొత్తం 1,55,629 పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయగా.. అందులో 79,485 పదవులను మహిళలకు రిజర్వు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12,951 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవుల్లో 6,472,  మొత్తం 1,31,116 వార్డు సభ్యుల పదవుల్లో 67,106 పదవులను మహిళలకు కేటాయించారు. మొత్తం 10,229 ఎంపీటీసీ పదవుల్లో 5,240 పదవులు, 660 మండల పరిషత్‌ అధ్యక్ష పదవుల్లో 330 పదవులు, మొత్తం 660 జెడ్పీటీసీ పదవుల్లో 331 పదవులు, 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు గాను 6 పదవులను మహిళలకే రిజర్వు చేయడం గమనార్హం.  

ఎస్సీలు, జనరల్‌కు పెరిగిన అవకాశాలు 
2018 ఆగస్టులో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినప్పటికీ అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తేల్చలేక పంచాయతీరాజ్‌ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎవరికీ నష్టం జరగకుండా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 2006లో జరిగిన పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఎస్సీలకు 18.30 శాతం, 2013 ఎన్నికల్లో 18.88 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించగా, ఈసారి ఆ కేటగిరీకి 19.08 శాతం రిజర్వేషన్లు కల్పించారు. జనరల్‌ కేటగిరీకి 2006లో 39.45 శాతం, 2013లో 37.97 శాతం పదవులు రిజర్వు కాగా, ఈసారి ఏకంగా 40.15 శాతం పదవులను రిజర్వు చేశారు. 2006, 2013 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బీసీలకు 34 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ జనాభా తక్కువగా ఉంది. ఎస్టీలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించారు. 

2020 ఎన్నికల్లో మొత్తం పదవుల్లో ఎవరికెన్ని..  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top