చంద్రబాబు పాపం పండింది!

Mohan Babu Fires On Chandrababu - Sakshi

టీడీపీ నీది కాదు.. ఎన్టీఆర్‌ వద్ద లాక్కున్నావు 

పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ సభ్యత్వాన్నే తొలగించావు 

దమ్ముంటే వైఎస్సార్‌ పథకాలను అమలుచేయలేనని చెప్పి పోటీచెయ్యి 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం 

శ్రీ విద్యా నికేతన్‌కు రూ.19కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు.. 

వాటిని వెంటనే చెల్లించాలంటూ రెండు గంటలపాటు నిరసన 

చంద్రగిరి (చిత్తూరు జిల్లా) : నంబరు వన్‌ హీరోగా ఉన్న ఎన్టీఆర్‌.. నిద్రహారాలు మానేసి టీడీపీని స్థాపించి అధికారంలోకి వస్తే ఆయన సభ్యత్వాన్నే తొలగించిన వ్యక్తి చంద్రబాబు అని శ్రీ విద్యా నికేతన్‌ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు మండిపడ్డారు. ఈ విద్యా సంస్థలకు సుమారు రూ.19 కోట్ల మేర ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను చంద్రబాబు సర్కారు చెల్లించకపోవడంపై ఆయన శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలపై పలుమార్లు బాబుకు ఉత్తరాలు రాసినా స్పందన లేకపోవడంతో ఉ.8.30 గంటలకు పది వేల మంది విద్యార్థులతో కలసి నిరసనకు దిగారు. తిరుపతిలో నిరసన చేపట్టడానికి నిర్ణయించినప్పటికీ పోలీసులు ఆయన్ను గృహనిర్బంధం చేయడానికి యత్నించారు. దీంతో మోహన్‌బాబు.. ‘మీరు మీ ఉద్యోగాలను చేయండి.. నా నిరసన మాత్రం ఆగదు’అని పోలీసులకు స్పష్టంచేశారు.తనయులు మంచు విష్ణు,  మనోజ్‌లతో కలసి మోహన్‌బాబు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా సంస్థ ల్లోని ఇంటర్నేషనల్‌ పాఠశాల నుంచి కాలినడకన ఇంజనీరింగ్‌ కళాశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.  

నాలుగున్నరేళ్ల పాటు రైతులు, మహిళలు గుర్తురాలేదా 
ఎన్నికల వేళ ఫీజు రియంబర్స్‌మెంట్‌ నిధులను చంద్రబాబు దారి మళ్లించారని.. ఓట్ల కోసం వాటిని రైతులకు, మహిళలకు ఇచ్చారని ఆరోపించారు. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో ఆయనకు రైతులు, మహిళలు గుర్తుకు రాలేదా అని మోహన్‌బాబు ప్రశ్నించారు. దివంగత  వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజురీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలుచేయను, రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికల్లోకి రాగలవా అని నిలదీశారు. చంద్రబాబు పాపం పండిందన్నారు. ‘ఎన్టీఆర్‌ స్థాపిం చిన టీడీపీలో నీ కన్నా ముందే నేను చేరాను చంద్రబాబు’.. అని  తెలిపారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీను లాక్కున్నాడని..ఎన్టీఆర్‌తో పాటు తన సభ్యత్వాన్ని తొలగించింది నిజం కాదా అన్నారు.  

బకాయిలు చెల్లించకుంటే కోర్టుకు.. 
శ్రీ విద్యా సంస్థల బకాయిలను చెల్లించకుంటే న్యాయ పోరాటానికైనా వెనుకాడబోనని మోహన్‌బాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకు లేనంతగా తమ సంస్థలకు సుమారు రూ.19 కోట్ల మేర ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top