బీజేపీ వల్లే దేశంలోకి కరోనా 

MLC Bhanu Prasad Slams On BJP And JP Nadda - Sakshi

మండలిలో ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌

మర్కజ్‌ గురించి మొదట చెప్పింది తెలంగాణే

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడిన మాటలు ఆశ్చర్యానికి గురిచేశాయని మండలిలో ప్రభుత్వ విప్‌ టి.భానుప్రసాద్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీ య అధ్యక్షుడు నడ్డాకు కరోనా లెక్కలు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరణాల యావరేజ్‌ రేటు జాతీయ స్థాయిలో 3.26 శాతం ఉంటే, తెలంగాణలో 2.26 శాతం ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎంపీ వెంకటేశ్‌ నేతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా అంతర్జాతీయ రవాణా ఆపకుండా కరోనా దేశంలోకి ప్రవేశించడానికి కారణం బీజేపీయేనని ఆరోపించారు.

కరోనా టెస్టుల కోసం రోజుకో దేశం నుంచి కిట్లు తెప్పించి గందరగోళానికి కేంద్రం గురి చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఐసీఎంఆర్‌ ఒకమాట చెప్తే–ఆయుష్‌ రాష్ట్రాలకు మరో మాట చెబుతోందన్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చెప్పే వరకు మర్కజ్‌ వ్యవహారం బయటపడలేదని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో బీజేపీ నేతలు చెబితే, తరువాత తాము రాష్ట్రానికి ఏమి చేశామో చెబుతామన్నారు. 

కిషన్, బండిల మాటల్లో పరిపక్వత లేదు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలు పరిపక్వత లేనివిగా ఉన్నాయని ఎంపీ వెంకటేశ్‌ నేత విమర్శించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకి అండగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారని, బీజేపీ నేతలు మాత్రం రాజకీయాలు మాట్లాడుతున్నారని వారి మైండ్‌ ఏమైనా పాడైందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో చైనా, దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఒక్కటేనని ధ్వజమెత్తారు. దేశమంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని,  తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేకే వారు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top