ఇసుక మాఫియా డాన్‌ కవాతుకు ముఖ్య అతిథా ? 

MLAs Slam Pawan Kalyan On Long March In Vizag Today - Sakshi

దోచుకుతిన్నవాళ్లతో లాంగ్‌మార్చా ? - ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 

ప్యాకేజీల కోసమే పవన్‌ హడావుడి - ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌  

సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్లలో ఇసుకను దోచుకుతిన్న టీడీపీతో కలిసి జనసేన లాంగ్‌మార్చ్‌ చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. లాంగ్‌మార్చ్‌తో పవన్‌కల్యాణ్, చంద్రబాబుల మధ్య బంధం బహిర్గతమైందన్నారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సుపుత్రుడు రాజకీయాలకు పనికిరాడని దత్తపుత్రుడైన పవన్‌కల్యాణ్‌తో ఫ్యాకేజీకి మాట్లాడి లాంగ్‌మార్చ్‌ చేయిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నుంచి వందల కోట్లు తీసుకుని గాజువాక, భీమవరాలలో పవన్‌కల్యాణ్‌ ఖర్చుపెట్టిన విషయం నిజం కాదా అని విమర్శించారు. కృష్ణానది పక్కన ఉన్న విజయవాడలో గానీ, గోదావరి పక్కన ఉన్న రాజమండ్రిలో గానీ పవన్‌కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌ పెట్టగలడా అని ప్రశ్నించారు.ఇది లాంగ్‌ మార్చ్‌కాదు, రాంగ్‌మార్చ్‌ అని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, అందుకనే ఇసుక కొరత ఉందని ప్రజలందరికీ తెలుస న్నారు.   సొంత బావ హరికృష్ణ శవం సాక్షిగా శవరాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని చెప్పారు.

సమావేశంలో మట్లాడుతున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 
ప్యాకేజీ కోసం చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ నటిస్తున్నాడని ఎద్దేవాచేశారు. రైతులు పల్లెల్లో సంతోషంగా ఉన్నారన్నారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీచేస్తే పవన్‌కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌ కాదు కదా..షార్ట్‌ మార్చ్‌ కూడా చేయలేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో రూ.4.90కే రవాణా చేస్తామంటే వారికే అనుమతిస్తున్నామన్నారు. సుమారు 267 రీచ్‌లు ఉంటే వరద కారణంగా కేవలం 67 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని చెప్పారు. వరద ఉధృతి తగ్గిన తరువాత  అక్రమాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో ఇసుక అందిస్తామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, అతని డ్రామా ట్రూప్‌ అంతా కుటిల రాజకీయాలు మాని ప్రజల క్షేమం కోసం పనిచేయాలని కోరారు. ప్రభుత్వానికి సలహాలివ్వండి, వాటిని స్వీకరించి ..ప్రజల క్షేమం కోసం పనిచేద్దామన్నారు. కాదని అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగేంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, సతీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. 

సాక్షి, విశాఖపట్నం:  సినిమాల్లో అనేక బ్యానర్లు, ప్రొడక్షన్లలో పనిచేసిన పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లో నారావారి ప్రొడక్షన్‌లో ప్యాకేజీలకోసం పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెం నగరపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నదులు ఏ విధంగా పొంగిపొర్లుతున్నాయో ప్రజలందరికీ తెలుసని, ఒక్క సీటు గెలిచిన పిల్లసేన పార్టీ ..23 సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల పార్టీ అయిన టీడీపీతో కలిసి లాంగ్‌మార్చ్‌ చేస్తామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమాల్లో నటించడం ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని, సినిమాల్లో కన్నా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే ఎక్కువని మానేశారని ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు.  ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని, వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే పేరు మార్చుకుంటానని పవన్‌కల్యాణ్‌ గత ఎన్నికల్లో ప్రగల్బాలు పలికాడని, మరి ఇప్పుడు నారా పవన్‌కల్యాణ్‌ అని ఎందుకు మార్చుకోలేదని విమర్శించారు. గాజువాకలో ఓటమి తర్వాత అక్కడి వారిని కలవని పవన్‌ ఇప్పుడు బాబు డైరెక్షన్‌లో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వైఖరి నచ్చకే విశాఖలో మాజీ మంత్రి బాలరాజు రాజీనామా చేశారన్నారు. 

ఇసుక మాఫియా డాన్‌ ముఖ్య అతిథా ? 
గత ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి లాంగ్‌మార్చ్‌కి ముఖ్య అతిథిగా పాల్గొంటుండడంపై ఆయన తీవ్రంగా విమరించారు. డ్రగ్‌ మాఫియా డాన్‌ అయ్యన్నపాత్రుడు, లిక్కర్‌ మాఫియా డాన్‌ వెలగపూడి రామకృష్ణబాబులను పక్కనపెట్టుకుని లాంగ్‌మార్చ్‌ చేస్తారా అని విమర్శించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వందరోజుల్లోనే జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్దానం సమస్యను పరిష్కరించడమే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పేర్ల విజయచంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, పరూఖి, జీవీ కృష్ణారావు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top