ఒకేసారి ఆహ్వానించగానే వెళ్ళలేదు.. కానీ!

MLA Gandra Venkatramana Reddy Couple gets Emotional - Sakshi

ముఖ్య అనుచరుల సమావేశంలో గండ్ర దంపతుల కంటతడి

సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సీనియర్‌ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు మంగళవారం భూపాలపల్లిలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో అనుచరులకు వివరించిన గండ్ర దంపతులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. గండ్ర జ్యోతి కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు.  తమ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని చెప్పారు. తమను నమ్మిన వారిని కాపాడుకుంటామని చెప్పారు. జెడ్‌పీ చైర్మన్ పదవి కోసం తాము పార్టీ మారామన్నది వాస్తవం కాదన్నారు. తమ నిర్ణయం వల్ల కొందరు బాధపడి ఉండొచ్చునని, కానీ ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. తనపై వాగుతున్న అవాకులు, చెవాకులు ఆగాలనే పార్టీ మారినట్టు చెప్పారు. ‘ఒకడు జిల్లాను తరలిస్తా అంటాడు.. ఇంకకొడు ఎలా అభివృద్ధి జరుగుద్దో చూస్తా అంటాడు.. ఇంకొకడు ఎలా తిరుగతాడో చూస్తా అంటాడు.. ప్రతిపక్షంలో ఉండి ఈ అవమానాలు భరించే కన్నా అధికార పార్టీలోకి వచ్చి ప్రజలకు అభివృద్ధి చేయాలని భావించాను. మాటలు చెప్పే వారికి నా పనితో సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌లోకి వచ్చాను’’ అని చెప్పారు. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరానని, ఒకేసారి ఆహ్వానించగానే వెళ్ళలేదని, అన్ని ఆలోచించి వెళ్ళానని గండ్ర వివరణ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top