
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరాచకాలను నిలదీసేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం చిత్తూరు జిల్లాలోని కలికిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని, ఆయనకు బుద్ధి చెప్పాలంటే.. అందుకు సరైన ఆయుధం ప్రజల చేతిలోనే ఉందని, ప్రజలు ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు ప్రజాప్రతినిధులు అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు.
టీడీపీ నేతలు అధికారదర్పం ప్రదర్శిస్తూ కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ బాలయ్యకుంట గ్రామస్తులకు నరకం చూపిస్తున్నారని, గ్రామస్తులు వైఎస్సార్‌సీపీలో చేరవద్దంటూ కిశోర్‌కుమార్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ సభలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఇక్బాల్ అహమ్మద్, కారపకుల భాస్కర్ నాయుడు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.