‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్‌’

Mithun Reddy Comments At NewsX Channel Debate - Sakshi

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల న్యాయమైన డిమాండ్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినితీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు.జాతీయ చానల్‌ న్యూస్‌ ఎక్స్‌ నిర్వహించిన ఇండియా నెక్ట్స్‌ డిబేట్‌లో మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. 51 శాతం ఓట్లతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వీప్‌ చేశారని తెలిపారు. 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ ప్రజల కష్టాసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన రోజు నుంచే వైఎస్‌ జగన్‌ ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. 

‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 50 శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం తమ సత్తాను నిరూపించాయి. రాజ్యసభలో బీజేపీ ఇంకా మైనారిటీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తాం. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని మేము భావించాం.. కానీ అది సాధ్యపడలేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని మాకు మాట ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ నేతలు కూడా సభలోనే ఉన్నారు. 60 శాతం ప్రజలకు 40 శాతం రెవెన్యూతో విభజించారు. దీంతో ఏపీ ఏటా 20వేల కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టాల్సి వస్తోంది. చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో అవినీతి పెరిగిందని జాతీయ సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల ఊబిలో నెట్టేశారు. పార్లమెంట్‌లో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి. సీబీఐ ఆంధ్రప్రదేశ్‌లో కేసులను దర్యాప్తు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. కానీ వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే సీబీఐ దర్యాప్తుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతి ఇచ్చార’ని మిథున్‌రెడ్డి డిబెట్‌లో పేర్కొన్నారు. 

ఏపీ, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి : బీజేడీ ఎంపీ
మిథున్‌రెడ్డితో పాటు బీజేడీ ఎంపీ పినాకి ఘోష్‌ కూడా ఇండియా నెక్ట్స్‌ డిబెట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. తుపాన్ల కారణంగా ఒడిశా తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top