చంద్రబాబు ఉచ్చులో పడొద్దు..

Minister Vellampalli Srinivas Comments On Chandrababu - Sakshi

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

సాక్షి, విశాఖపట్నం: సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతోనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణలు రాజధానిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని వెల్లడించారు. రాజధానిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయని.. రాష్ట్ర రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. టీడీపీతో గత ఐదేళ్లుగా జత కట్టిన బీజేపీ ఎందుకు 1500 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందో సమాధానం చెప్పాలన్నారు. ‘రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చువుతుందని ఆనాడు టీడీపీ, బీజేపీలు చెప్పలేదా.. బీజేపీ లక్ష కోట్లు ఇస్తే రాజధానిని అమరావతిలో కొనసాగించడానికి సిద్ధమని’ తెలిపారు.

ఆయనకు విజన్‌ లేదు..ప్యాకేజీ ఇస్తే చాలు..
పవన్‌కు విజన్‌ లేదని..ప్యాకేజీ ఇస్తే చాలని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ గుర్తింపు కోసమే ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము చంద్రబాబు పర్యటనను అడ్డుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌పై తప్పుడు కేసు పెట్టలేదా.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌ను అడ్డుకోలేదా’ అని నిప్పులు చెరిగారు. రానున్న రోజుల్లో చంద్రబాబు మూడు సీట్లకే పరిమితమవుతారన్నారు.  పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా  రాష్ట్రమంతా  అభివృద్ధి చేయాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

వారే రాజధాని ఉద్యమంలో ఉన్నారు..
రియల్ ఎస్టేట్ మాఫీయా, భూదందా చేసేవాళ్లే ఎక్కువ మంది రాజధాని ఉద్యమంలో ఉన్నారని దుయ్యబట్టారు. రాజధాని రైతులను రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని.. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని సూచించారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థులకు వరమని.. సీఎం జగన్‌ మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. అని వర్గాల సంక్షేమమే వైస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top