కాళేశ్వరం లక్ష కోట్లు కాదు.. రూ.80వేల కోట్లే 

Minister Harish Rao Counter to Rahul Gandhi - Sakshi

     స్క్రిప్ట్‌ రైటర్లతో జాగ్రత్తగా ఉండండి 

     ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌కి మంత్రి హరీశ్‌ కౌంటర్‌ 

     అంబేడ్కర్‌ ప్రాజెక్ట్‌ నిలిపివేయలేదు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి, దానివ్యయాన్ని భారీగా పెంచారన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు కొట్టిపారేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరిగిందని స్క్రిప్టు రైటర్లు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌కు సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా హరీశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌ పేరుతో అంచనా వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి, లక్ష కోట్లకు పెంచారని రాహుల్‌కు స్క్రిప్ట్‌ రైటర్లు చెప్పారు. కానీ ప్రాణహిత–చేవెళ్ల తొలి జీవో రూ.17 వేల కోట్లకు జారీ చేశారని వారు మరచిపోయారు. ఏడాది వ్యవధిలో కనీసం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకముందే.. 2008లో రూ.38 వేల కోట్లకు, 2010లో రూ.40 వేల కోట్లకు డీపీఆర్‌ సిద్ధం చేశారు’అని పేర్కొన్నారు.

ప్రాజెక్టు వ్యయం అలా ఎందుకు పెంచారో రాహుల్‌ చెప్పగలరా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80,190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించిందని, లక్ష కోట్లకు కాదని స్పష్టం చేశారు. ఈ విషయం రాహుల్‌ స్క్రిప్ట్‌ రైటర్లకు తెలియదా అని ప్రశ్నించారు. మన దేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ అనేది అపెక్స్‌ బాడీ అని, జలవనరుల శాఖకు ఇది అనుబంధమని, ఈ విషయంపై రాహుల్‌కు గానీ, ఆయన స్క్రిప్ట్‌ రైటర్లకు గానీ అవగాహన లేదా? అని ఎద్దేవా చేవారు. అలాంటి అత్యున్నత కమిషన్‌ విశ్వసనీయతను రాహుల్‌గాంధీ ఎలా అనుమానిస్తారని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ ప్రాజెక్టు పేరును రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంగా మార్చిందని రాహుల్‌ చెప్పారని, ఈ విషయంలోనూ స్క్రిప్టు రైటర్లు తప్పుదోవ పట్టించారన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు అలాగే ఉందని ట్విట్టర్‌లో మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top