రాహుల్‌ గాంధీ భద్రతకు ముప్పు : కాంగ్రెస్‌

MHA Dismisses Snipher Threat To Rahul Gandhi As Green Light From Mobile Phone - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ భద్రత విషయంలో ఉల్లంఘనలు జరిగాయంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. రాహుల్‌ గాంధీ భద్రత విషయంలో ఇప్పటికే దాదాపు ఏడు సార్లు ఉల్లంఘనలు జరిగాయని లేఖలో ఆరోపించారు.

లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం..  బుధవారం(నిన్న) రాహుల్‌ గాంధీ అమేథీలో తన నామినేషన్‌ ఫైల్‌ చేసిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో రాహుల్‌ గాంధీ తలపై ఆకుపచ్చ రంగు లైట్‌ కనిపించింది. రెండు సార్లు ఈ లైట్‌ రాహుల్‌ గాంధీ తలపై కనిపించడం గమనార్హం. అయితే ఈ లేజర్‌ లైట్‌ స్నైపర్‌ గన్‌ నుంచి వెలువడిందని కాంగ్రెస్‌ నాయకులు లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఇందుకు సంబంధించిన వీడియోను పలువురు మాజీ భద్రతా అధికారులు పరిశీలించారని తెలిపారు. వారు కూడా ఈ లైటింగ్‌ అనేది స్నైపర్‌ గన్‌ లాంటి ప్రమాదకర ఆయుధం నుంచి వెలువడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారని లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ లేఖపై కాంగ్రెస్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌, రందీప్‌ సుర్జేవాలాతో పాటు జైరాం రమేష్‌ కూడా సంతకం చేశారు. దాంతోపాటు ఇందుకు సంబంధించిన వీడియో ఉన్న పెన్‌ డ్రైవ్‌ను కూడా కేంద్ర హోం శాఖకు పంపించారు. అంతేకాక రాహుల్‌ గాంధీకి పటిష్టమైన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

స్నైపర్‌ నుంచి కాదు.. మొబైల్‌ నుంచి
అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. కాంగ్రెస్‌ నేతల నుంచి ఎలాంటి లేఖ అందలేదని పేర్కొంది. ఈ ఘటనపై  ఎస్పీజీ డైరెక్టర్‌తో మాట్లాడమని తెలిపింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ లైట్‌ స్నిఫర​ గన్‌ నుంచి రాలేదని..  సెల్‌ఫోన్‌ నుంచి వచ్చిందని ఎస్పీజీ డైరెక్టర్‌ చెప్పినట్లు హోంశాఖ స్పష్టం చేసింది. రాహుల్‌ గాంధీ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top