
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబం మాత్రమే లాభపడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మెదక్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. పలువురు మెదక్ టీడీపీ నేతలతో కలసి వచ్చిన శశికళకు గాంధీభవన్‌లో ఉత్తమ్, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం నిలువునా వంచించిందని ఆరోపించారు. తెలంగాణ వస్తే దళితులకు భూమి, పేదలకు ఇళ్లు, విద్య, వైద్యం వస్తుందని ఆశపడ్డామన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెబుతున్నారని, కానీ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని అన్నారు.