ఢిల్లీ నిర్ణయంపై మాయవతి అభ్యంతరం

Mayawati Urges Centre to Intervene on Delhi Govt Decision - Sakshi

లక్నో: ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) నాయకురాలు మాయావతి కోరారు. దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో ఢిల్లీయేతరులకు చికిత్స అందించకూడదని హస్తిన సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘దేశానికి ఢిల్లీ రాజధాని. ముఖ్యమైన పనుల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యానికి గురైతే వారు ఢిల్లీవాసులు కాదన్న కారణంతో చికిత్స చేసేందుకు నిరాకరించడం సరైంది కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల’ని మాయావతి ట్వీట్‌ చేశారు. (ఢిల్లీ ఆసుప‌త్రుల్లో 'ఇత‌రుల‌కు' నో ఛాన్స్‌!)

లాక్‌డౌన్‌ను సడలించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా, ఢిల్లీలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు సరిపోవడం లేదని, 90 శాతం పడకలు స్థానికులకే కేటాయించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్‌; వైద్యానికీ ఆధార్‌!)

వివక్ష ఎందుకు?: సీఎం చౌహాన్‌
కేజ్రీవాల్ సర్కారు నిర్ణయాన్ని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆక్షేపించారు. ‘కేజ్రీవాల్ జీ పేరులో 'వాల్ (ఎల్)' ఉంది. అందుకని ఆయన దాన్ని నిర్మిస్తారా? అలాంటి వివక్ష ఎందుకు?’ అంటూ సీఎం చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీయేతరులకు చికిత్స నిరాకరించడం సిగ్గుచేటని హస్తిన బీజేపీ నాయకుడు మనోజ్‌ తివారి అంతకుముందు విమర్శించారు. కేజ్రీవాల్‌ పాలనలో ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిస్సహాయంగా మారిందని దుయ్యబట్టారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top