బీజేపీ - టీడీపీ మళ్లీ కలుస్తాయి

May BJP TDP Alliance Once Again : YSRCP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ-టీడీపీలు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అన్నారు. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క, ప్రత్యేక హోదా డిమాండ్‌తో గురువారం ఆంధ్రప్రదేశ్‌ అంతటా రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటు భవన్‌ వద్ద విలేకరులతో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి మాట్లాడారు.

'విభజన హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుంటే బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ కుమ్మక్కయ్యాయంటూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు యూటర్న్‌ తీసుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చంద్రబాబు కృష్టి చేయాలి. నాలుగేళ్లుగా బీజేపీతో కాపురం చేసి టీడీపీ చేసిందేమీ లేదు. కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేస్తాం. అవిశ్వాసంపై సహకరించాలని పలు పార్టీలను కోరుతున్నాం. చంద్రబాబు తీరువల్లే విభజన హామీలు నెరవేరట్లేదు.

ప్రజల ఒత్తిడి మేరకే చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు. లాలుచీ రాజకీయాలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. విభజన హామీల కోసం నాలుగేళ్లుగా వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తోంది. ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాకు విలన్‌ చంద్రబాబే. వైఎస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి క్రెడిట్‌ వస్తుందని చంద్రబాబు అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకున్నారు. ప్రతి రోజు పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయడం కేంద్ర ప్రభుత్వానికి సమంజసం కాదు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ చర్చ జరిపించాల్సిందే' అని ఎంపీలు డిమాండ్‌ చేశారు. గత కొద్ది రోజులుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటిసులు ఇస్తున్నా సభ సజావుగా లేదంటూ స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top