ఆ ప్రమాదం బాధ్యత మమత సర్కార్‌దే!

mamata banerjee govt responsible for bridge collapse - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా నగరానికి మరో విషాదం తప్పలేదు. 2016లో వివేకానంద రోడ్డులోని ఫ్లైఒవర్‌ కూలిపోయి 27 మంది మరణించి, దాదాపు 60 మంది గాయపడినా పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మేల్కొనలేదు. పర్యవసానంగా విమానాశ్రయానికి వెళ్లేదారిలోని మేజర్‌హట్‌ వంతెన మంగళవారం కూలిపోయి ఒకరు మరణించగా 21 మంది గాయపడ్డారు. గత ప్రభుత్వం అంటే సీపీఎం ప్రభుత్వం తప్పుడు డిజైన్‌ను ఆమోదించడం వల్ల వివేకానంద రోడ్డులోని వంతెన కూలిపోయిందంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాడు నెపాన్ని నెట్టేశారు.

ఆ వంతెన కూలిపోయిన సందర్భంగానే ఢిల్లీ నుంచి పిలిపించిన ఓ ఏజెన్సీ వచ్చి మేజర్‌హట్‌తో పాటు నగరంలోని పలు వంతెనల పరిస్థితిని ఆడిట్‌ చేసింది. పదే పదే రోడ్డు లేయర్లు వేస్తూ రావడం వల్ల మేజర్‌హట్‌ వంతెన బరువు పెరిగిందని, అంత బరువును తట్టుకునే పరిస్థితుల్లో పిల్లర్లు లేవని, అధిక బరువును సమాంతరంగా పంపిణీ చేసేలా అదనపు పిల్లర్లను నిర్మించకపోతే వంతెన కూలిపోతుందని ఆ ఏజెన్సీ హెచ్చరించింది. అయినప్పటికీ మమత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఆ వంతెన కూలింది. 2016లో కూలిపోయిన వివేకానంద వంతెన తాలూకా శిథిలాలు ఇంకా ప్రమాదకరంగానే వేలాడుతున్నాయని, వాటిని తొలగించాలంటూ స్థానిక పత్రికల్లో పలుసార్లు వార్తలు వచ్చినా ఆమె ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శిథిలాలను తొలగించేందుకు కూడా ఎంతో ఖర్చు అవుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అంత నిధులు లేవని ఆమె చెబుతూ వస్తున్నారు.

ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మమతా ప్రభుత్వం ఏ తప్పు జరిగినా నెపాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టేసి తప్పించుకోవాలని చూస్తోంది. ఈ ఆరేళ్ల కాలంలోనే కోల్‌కతాలో మూడు వంతెనలు కూలిపోయాయి. వంతెనలు ఎప్పుడు నిర్మించినా వాటి నిర్వహణ బాధ్యతలు మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వానివే అవుతుంది. ఇలాంటి ప్రమాదాలు ఒక్క కోల్‌కతాలో, ఒక్క పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోనే జరగడం లేదు. ముంబైలోని అంధేరి రైల్వే బ్రిడ్జిలో కొంత భాగం గత జూలై నెలలో కూలిపోగా ఒకరు మరణించి, పలువురు గాయపడ్డారు. బ్రిడ్జి ఆడిటింగ్‌ జరిగిన ఆరు నెలలకే ప్రమాదం జరగడం గమనార్హం. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఛాంబ పట్టణాన్ని, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ను కలుపుతూ నిర్మించిన కాంక్రీట్‌ వంతెన గతేడాది కూలిపోగా ఆరుగురు మరణించారు. మన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top