
కోల్‌కతా : నియంతగా ప్రసిద్ధి చెందిన అడాల్ఫ్ హిట్లర్ గనక ఇప్పుడు బతికి ఉంటే.. మోదీ చర్యలు చూసి ఆత్మహత్య చేసుకునేవాడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. రాయ్‌గంజ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న దీదీ.. మోదీపై విమర్శల వర్షం కురిపించారు. హింసావాదులను, మూక హత్యలు చేసేవారిని మోదీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. దాని రూపు రేఖలను మార్చేశారని మండిపడ్డారు. దేశంలో ఉన్న అన్ని కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్షాలపై దాడులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.
‘మోదీ సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి. అందుకే తన గురించి ఏకంగా సినిమానే తీయించాడు. కానీ అతను అల్లర్లను ప్రేరేపిస్తాడు. గుజరాత్ మారణకాండను ఎన్నటికి మర్చిపోర’ని తెలిపారు. జనసమూహాన్ని ఉద్దేశిస్తూ.. ‘బీజేపీ.. బెంగాల్‌లో జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ను అమల్లోకి తెచ్చి మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేయాలని చూస్తుంది. ఒక వేళ వారు గనక దాన్ని అమల్లోకి తెస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో వారికి తెలియద’ని హెచ్చరించారు. మోదీని గద్దె దింపితేనే.. నవ భారత నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయిందని.. అందుకే కాషాయ పార్టీ రోజు రోజుకు శక్తివంతంగా తయారయ్యిందన్నారు. ఒక వేళ కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల సాయం కావాలని వెల్లడించారు. అప్పుడు కేంద్రంలో తృణమూల్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.