ప్రజాగ్రహంలో కొట్టుకుపోవాల్సిందే!

Mallu Bhatti Vikramarka Slams On KCR - Sakshi

కొల్లాపూర్‌: ‘మీరు ఇష్టం వచ్చినట్టల్లా దోచుకుతింటుంటే.. చూస్తూ కూర్చోవడానికి ప్రజలేం అమాయకులు కారు.. ప్రజలు కన్నెర్రజేస్తే ఆ ఆగ్రహంలో మీరు కొట్టుకుపోవాల్సిందే..’ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యాన చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా శుక్రవారం కొల్లాపూర్, అచ్చంపేటలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభలు, రోడ్డు షోల్లో భట్టి విక్రమార్కతోపాటు ఎంపీ నంది ఎల్లయ్య, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, ప్రచార కమిటీ కోచైర్మన్‌ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ మేరకు హెలీక్యాప్టర్‌లో వచ్చిన నాయకులకు కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యాన పలువురు స్వాగతం పలికారు. రోడ్డు షో నిర్వహిస్తూ కొల్లాపూర్‌ రాజావారి బంగ్లా ఎదుట ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకున్నారు. 

కొల్లాపూర్‌తో ఎంతో అనుబంధం

కొల్లాపూర్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. మాజీ ఎంపీ మల్లు అనంతరాములు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాననని గుర్తుచేశారు. జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉండి కొల్లాపూర్‌కు పరిశ్రమలు తేలేదని, స్వార్థ ప్రయోజనాల కోసం కేఎల్‌ఐ ప్రాజెక్టు పనులు ఆలస్యంగా పూర్తయ్యేందుకు కారణమయ్యారన్నారు.

కేఎల్‌ఐ ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ హయాంలో ప్రారంభించారని, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేశారన్నారు. అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను పూర్తిచేసి ప్రాజెక్టు మొత్తం టీఆర్‌ఎస్సే పూర్తిచేసిందనే రీతిలో ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లాపూర్‌ అభివృద్ధి కోసం సోమశిల బ్రిడ్జిని నిర్మిస్తామని, కొల్లాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తామని, జీఓ 98 అమలు చేసి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని, అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

సోనియా రుణం తీర్చుకుందాం 

‘తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్‌కు ఒ కసారి ఓటేశారు.. ఇప్పు డు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ఓటేసి ఆ తల్లి రుణ  తీర్చుకుందాం’ అని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ప్రజలను కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని సభ్యత, సంస్కారం లేకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సోని యాగాంధీ ప్రజల బాగుకోరి తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ను దాన్ని తన అవసరాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలి 

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తన ఆస్తిగా కేసీఆర్‌ కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నారన్నారు. కొల్లాపూర్‌ ప్రజల హక్కుల కోసం బీరం హర్షవర్ధన్‌రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడుతూ పాల మూరు జిల్లాలోని అన్ని స్థానాలతోపాటు, కొల్లాపూర్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.

నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల బ్రిడ్జి మా హక్కు అని.. దాన్ని సాధించుకునేందుకు ఎంత పోరాటమైనా చేస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. కొల్లాపూర్‌లో సంబరాల నిర్వహణకు జూపల్లి కృష్ణారావు రూ.5 కోట్లు ఖర్చు చేశారని, దీని పై ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టాలన్నారు. రత్నగిరి ఫౌండేషన్‌కు వస్తున్న విరాళాల వివరాలపై కూడా విచారణ జరపాలన్నారు. సభలో ఏపూరి సోమన్న ఆటపాటలతో అలరించగా.. పార్టీ రాష్ట్ర నాయకులు దేవని సతీష్‌ మాదిగ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, టీపీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు రంగినేని జగదీశ్వరుడు, జగన్మోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఓయూ నాయకులు వెంకటేష్, నాయకులు జగదీశ్వర్‌రావు, రత్నప్రభాకర్‌రెడ్డి, జంబులయ్య, గాలియాదవ్, రామచందర్‌యాదవ్, కిషన్‌నాయక్, వేణుగోపాల్‌యాదవ్, మతీన్‌ అహ్మద్, శ్రీధర్‌రెడ్డి, గణేశ్‌రావు పాల్గొన్నారు. 

‘అందిన కాడికి దోచుకున్నారు’

అచ్చంపేట: ప్రజలు అమాయకులు కాబట్టే 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ను నమ్మి ఓట్లు వేస్తే అందిన కాడికి దోచుకున్నారని స్టార్‌ క్యాంపెయిన్‌ విజయశాంతి అన్నారు. అచ్చంపేట కూమరస్వామి రైస్‌మిల్లు ఆవరణలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశారు. హెలీక్యాప్టర్‌లో ఎన్టీఆర్‌ స్టేడియం చేరుకున్నా కాంగ్రెస్‌ అగ్రనేతలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుషో ద్వారా బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్‌ ఓటును డబ్బుతో కొని అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌ ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.

మీ అభిమానం చూస్తే కాంగ్రెస్‌కు అధికారం ఖాయమనిపిస్తుందని, మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తేవడం తప్ప మరో మార్గం లేదన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ పాలమూరు జిల్లాను అధికార పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.   కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద వి విధ పథకాలు అమ లు చేస్తామ న్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్‌ అనురాధ, సరిత, ధర్మానాయక్, ఎంïపీపీలు భాగ్యలక్ష్మి, సుదర్శన్, శారదమ్మ, చంద్రమోహన్, రామ్మోహన్, రఘునాయక్, అనంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

జూపల్లికి కాంగ్రెస్‌తోనేరాజకీయ భిక్ష 

‘బ్యాంకు ఉద్యోగి అయిన జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసింది కాంగ్రెస్‌. ఇప్పుడు ఆ పార్టీనే ఆయన తిడుతున్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం జూపల్లి’ అని డీకే అరుణ విమర్శించారు. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టానని చాలాసార్లు చెప్పారు. ఆయన నాకు భిక్ష పెట్టలేదు. పాన్‌గల్‌లో జెడ్పీటీసీగా పోటీచేసినప్పుడు నన్ను ఓడించడానికి కుట్ర చేశారు. అక్కడి ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు. జూపల్లికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌’ అని ఆమె అన్నారు. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్లిచ్చిన తర్వాతనే ఓట్లడుగుతానని కేసీఆర్‌ ప్రకటించారు. మరి ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఓట్లెలా అడుగుతారని ఆమె ప్రశ్నించారు. కొల్లాపూర్‌ ప్రజలను ప్రతిసారి మోసం చేసి గెలుస్తున్న జూపల్లిని ఈసారి ఓడించాలని ఆమె కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 25 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top