బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు

Maharashtra governor invites Shiv Sena to form government - Sakshi

మారిన మహారాష్ట్ర సమీకరణం

ప్రతిపక్షంలోనే ఉంటామన్న బీజేపీ

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు గవర్నర్‌ ఆహ్వానం

సంసిద్ధత తెలిపేందుకు నేటి సాయంత్రం వరకు గడువు

సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మధ్య ఊపందుకున్న చర్చలు

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రెండు వారాలకు పైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆదివారం సాయంత్రం వేగంగా పరిణామాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే.  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి.
సీఎం పదవి విషయంలో శివసేనతో అంతరం పెరిగిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు చాలినంత బలం కూడగట్టలేక బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపింది. దీంతో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆహ్వానం పంపారు. ఈ విషయంలో అభిప్రాయం తెలపాలంటూ సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు గవర్నర్‌ ఆ పార్టీ శాసనసభా నేత ఏక్‌నాథ్‌ షిండేకు గడువిచ్చారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు.

అంతకుముందు సేన చీఫ్‌ ఠాక్రే నగరంలోని ఓ హోటల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో తమ పార్టీ నేత సీఎం పీఠం ఎక్కనున్నారంటూ ప్రకటించారు. ప్రతిపక్షం మద్దతుతో సర్కారు ఏర్పాటుకు గల అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ కూడా తెలిపారు. ఏదేమైనా తమ పార్టీ నేతే సీఎం అవుతారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు. ఈ పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ఊపందుకున్నాయి.  

శివసేన ఎన్డీఏ నుంచి వైదొలిగితేనే..
శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్‌ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్‌ పవార్‌ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘సేన–ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో కాంగ్రెస్‌ మద్దతిస్తుంది. కాంగ్రెస్‌కు స్పీకర్‌ పోస్టు దక్కే అవకాశముంది’ అన్నారు.

కాంగ్రెస్‌ తమకు విరోధి కాదంటూ సామ్నా పేర్కొనడంపై కాంగ్రెస్‌ నేత ఒకరు మాట్లాడుతూ.. సేనకు మద్దతు తెలపాలంటే, ముందుగా ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలి. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అరవింద్‌ సావంత్‌ రాజీనామా చేయాలి’ అన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శివసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అప్పగించరాదని కొందరు, కాంగ్రెస్‌–ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి శివసేన మద్దతిస్తే చాలునని మరికొందరు అంటున్నారు. రాష్ట్రపతి పాలన రావాలని తమ పార్టీ కోరుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ తెలిపారు.  

ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ నిర్ణయం
ఇటీవలి ఎన్నికల్లో శివసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ ఆదివారం ప్రభుత్వం ఏర్పాటులో అన్ని ప్రయత్నాలు చేసింది. శివసేన ససేమిరా అనడంతో గవర్నర్‌ను కలిసి ప్రతిపక్షంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. శివసేన పట్టు కారణంగా ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ తెలిపారు. ‘శివసేన ప్రజల తీర్పును అపహాస్యం చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అందుకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాం’అని ఆయన అన్నారు.

అందరి చూపు కాంగ్రెస్‌ వైపు
మహారాష్ట్ర పరిణామాలు మరోసారి కర్ణాటక రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. అక్కడ ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్‌ కొన్ని స్థానాలు మాత్రమే గెలుచుకున్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, తలబొప్పి కట్టించుకుంది. మహారాష్ట్రలో.. శివసేనతో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ అతిపెద్ద పార్టీ గా అవతరించింది. శివసేనతో సీఎం పీఠం విషయంలో పొసగక తెగదెంపులు చేసుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చినప్పటికీ బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 25 సీట్ల దూరంలో ఉండిపోయింది. అయితే, గవర్నర్‌ ఆహ్వానంతో సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టేందుకు సేన సిద్ధమయింది.

అయితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భాగస్వామ్య పక్షాలతో సాధారణంగా తలెత్తే విభేదాల కారణంగా తమ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వలలో పడే అవకాశముందని కర్ణాటక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కాంగ్రెస్‌ భయపడుతోంది. సంకీర్ణంలో భాగస్వామి అవుతుందా? లేక బయటి నుంచి మద్దతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందోననే భయంతో శివసేన కూడా క్యాంపు నడుపుతున్న విషయం తెలిసిందే.

శివసేన తన ప్రయత్నాల్లో ఉందా?
బీజేపీ మద్దతు లేకుండానే శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావడం ఆసక్తి కరంగా మారింది. కొన్ని రోజులుగా శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ‘త్వరలోనే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందంటూ’ మాట్లాడటం వెనుక అంతరార్థం ఇదా అని విశ్లేషకులు విస్తుపోతున్నారు. శివసేన నేత సంజయ్‌ రౌత్‌ వారం రోజుల్లో మూడు సార్లు పవార్‌ ఇంట్లో భేటీ కావడం అంతర్గతంగా ఏదో ఒప్పందం జరిగి ఉండొచ్చని అనే ఊహాగానాలకు తావిస్తోంది. దీంతోపాటు, సోమవారం శివసేన సంజయ్‌ రౌత్‌ సోనియా గాంధీతో భేటీ అయేందుకు డిల్లీ వెళుతున్నట్లు సమాచారం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top