ఈనెల 23న మంత్రివర్గ విస్తరణ..!

Maharashtra Cabinet Expansion May On December 23 - Sakshi

మూడు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున ప్రమాణం! 

సాక్షి, ముంబై: శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఈ నెల 23న జరిగే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు మంత్రుల చొప్పున మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. నవంబర్‌ 28వ తేదీన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు మూడు పార్టీలకు చెందిన ఏక్‌నాథ్‌ షిండే, సుభాస్‌ దేశాయ్, ఛగన్‌ భుజబల్, జయంత్‌ పాటిల్, బాలాసాహెబ్‌ థోరాత్, నితిన్‌ రావుత్‌ ఇలా ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత నాగ్‌పూర్‌లో సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆ ఆరుగురు మంత్రులకు ఈ నెల 12వ తేదీన తాత్కాలికంగా పలు శాఖల బాధ్యతలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 23 లేదా 24వ తేదీన జరిగే మొదటి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి....? ఏ మంత్రి పదవి లభిస్తుంది...? అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సామాన్య ప్రజలు కూడా మంత్రివర్గ విస్తరణపై దృష్టిసారించారు.

18 మందికి చోటు..
శివసేన 10 మంది ఎమ్మెల్యేల పేర్లు, కాంగ్రెస్‌ 9 మంది, ఎన్సీపీ 8 ఇలా మొత్తం 27 మంది ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితా రూపొందించాయి. అందులో ఆరుగురు చొప్పున అంటే 18 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించనుంది. అదృష్టం ఎవరిని వరిస్తుందనేది విస్తరణ తరువాత తేటతెల్లం కానుంది. మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలున్న ఎమ్మెల్యేలలో శివసేన నుంచి 10 రాందాస్‌ కదం, అనీల్‌ పరబ్, సునీల్‌ ప్రభు, దీపక్‌ కేసర్కర్, ఉదయ్‌ సామంత్, తానాజీ సావంత్, గులాబ్‌రావ్‌ పాటిల్, ఆశీష్‌ జైస్వాల్, సంజయ్‌ రాఠోడ్, సుహాస్‌ కాందేలకు అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌లో అశోక్‌ చవాన్, పృథ్వీరాజ్‌ చవాన్, విజయ్‌ వడెట్టివార్, వర్షా గైక్వాడ్, యశోమతి ఠాకూర్, సునీల్‌ కేదార్, సతేజ్‌ పాటిల్, కే.సి.పాడ్వీ, విశ్వజీత్‌ కదం. ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్, దిలీప్‌ వల్సే పాటిల్, ధనంజయ్‌ ముండే, హసన్‌ ముశ్రీఫ్, నవాబ్‌ మలిక్, రాజేశ్‌ టోపే, అనీల్‌ దేశ్‌ముఖ్, జితేంద్ర అవ్హాడ్‌లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top