నేడు ‘బల నిరూపణ’ ఉంటుందా?

Madhya Pradesh governor asks Kamal Nath to face floor test on Monday - Sakshi

నేటి నుంచి మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

తొలిరోజే విశ్వాస పరీక్ష జరగాలన్న గవర్నర్‌

నిర్ణయం సభలో ప్రకటిస్తానన్న స్పీకర్‌

భోపాల్‌: రాజకీయ సంక్షోభం నెలకొన్న మధ్యప్రదేశ్‌లో నేటి(సోమవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. సభను ఉద్దేశించి ఉదయం తాను ప్రసంగించిన అనంతరం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ శనివారం రాత్రి ఆదేశించారు.  ‘నా ప్రసంగం ముగియగానే, విశ్వాస పరీక్ష ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 16న అది జరగాలి. వాయిదా వేయకూడదు’ అని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు పంపిన లేఖలో ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవడంపై తన నిర్ణయం సోమవారం ప్రకటిస్తానని స్పీకర్‌ ఎన్పీ ప్రజాపతి వెల్లడించారు. దాంతో సోమవారం విశ్వాస పరీక్ష జరుగుతుందా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 22 మంది రాజీనామా చేయడం, దాంతో మిగిలిన ఎమ్మెల్యేలను రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌కు కాంగ్రెస్‌ తరలించడం తెలిసిందే. వారంతా బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేం దుకు వీలుగా ఆదివారం తిరిగివచ్చారు. వారిని ఇళ్లకు పంపిం చకుండా, భోపాల్‌లోని ఒక హోటల్‌కు తరలించారు. రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను మాత్రమే స్పీకర్‌ ఆమోదించారు.  కాగా, సభ్యులంతా  హాజరై, పార్టీ నిర్ణయం మేరకు ఓటేయాలని కాంగ్రెస్, బీజేపీ విప్‌ జారీ చేశాయి. కాగా, విశ్వాస పరీక్షకు సంబంధించిన విషయం అసెంబ్లీ సెక్రటేరియట్‌ ఆదివారం రాత్రి విడుదల చేసిన ‘సభాకార్యక్రమాల జాబితా’లో లేకపోవడం గమనార్హం. గవర్నర్‌ ప్రసంగం, ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశాలే అందులో ఉన్నాయి.    

ఈ రోజు డౌటే..: సోమవారం ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ విశ్వాస పరీక్షను ఎదుర్కోకపోవచ్చని తెలుస్తోంది. సోమవారం బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆదేశించినప్పటికీ.. తుది నిర్ణయాధికారం స్పీకర్‌కే ఉంటుందని రాష్ట్ర మంత్రి పీసీ శర్మ పేర్కొన్నారు. అయితే, ముందుగా ఎమ్మెల్యేలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు. ఈ బల నిరూపణ సోమవారం జరగదని, ఈ అంశం కోర్టుకు వెళ్లే అవకాశం  ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు సంకేతాలిచ్చారు. మరోవైపు, గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాగానే, విశ్వాస పరీక్ష జరపాలని డిమాండ్‌ చేస్తూ, సభాకార్యక్రమాలను బీజేపీ అడ్డుకునే అవకాశముంది.

విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ సీఎం కమల్‌నాథ్‌కు గవర్నర్‌ టాండన్‌ రాసిన లేఖలో.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానంలో మాత్రమే బల నిరూపణ జరగాలని ఆదేశించారు.   అసెంబ్లీలో 228 మంది సభ్యులుండగా, ఆరుగురి రాజీనామాలు ఆమోదం పొందడంతో అది 222కి చేరింది.  మిగతా 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలూ ఆమోదం పొందితే ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మెజారిటీకి అవసరమైన మ్యాజిక్‌ నంబర్‌ 104 అవుతుంది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజీనామాలకు ముందు సభలో కాంగ్రెస్‌ బలం 114. అందరి రాజీనామాలు ఆమోదం పొందితే అది 92కి చేరుతుంది. అలాగే,  నలుగురు స్వతంత్ర, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఎటువైపు నిలుస్తారన్నదీ ప్రశ్నార్థకమే.

గుజరాత్‌ లో కాంగ్రెస్‌కు షాక్‌
అహ్మదాబాద్‌: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గుజరాత్‌లో షాక్‌ తగిలింది. నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించినట్లు స్పీకర్‌ త్రివేదీ తెలిపారు. దీంతో సభలో కాంగ్రెస్‌ బలం 73నుంచి 69కి చేరింది. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టే అవకాశముందనే భయంతో కాంగ్రెస్‌ 14 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌కు తరలించింది. గుజరాత్‌ నుంచి బీజేపీ ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభ బరిలో నిలిపింది. అయితే, వారిలో ఇద్దరిని మాత్రమే బీజేపీ గెలిపించుకోగలదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top