కమల్‌ను కాపాడిన ‘కరోనా’

Madhya Pradesh Assembly adjourns till March 26 - Sakshi

కరోనా కారణంగా అసెంబ్లీని 26 వరకు వాయిదా వేసిన మధ్యప్రదేశ్‌ స్పీకర్‌

విశ్వాస పరీక్షకు పట్టుబట్టిన విపక్షం

సుప్రీంకోర్టుకు బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌

భోపాల్‌/న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్‌ రాజకీయాల్లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్‌ కమల్‌ నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా ఆదుకుంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించిన నేపథ్యంలో.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభను మార్చి 26 వరకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ప్రజాపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు, కోవిడ్‌–19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త మహమ్మారిగా నిర్ధారించిందని, ఆ వైరస్‌ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో.. రాజస్తాన్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారని మంత్రి గోవింద్‌ సింగ్‌ స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు, మంగళవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఆదేశిస్తూ గవర్నర్‌ టాండన్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సోమవారం మరో లేఖ రాశారు.

విశ్వాస పరీక్ష జరపనట్లయితే.. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తక్షణమే బల నిరూపణకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.

నిమిషం పాటే గవర్నర్‌ ప్రసంగం: బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు గవర్నర్‌ సభను ఉద్దేశించి ఇచ్చే ప్రసంగం సోమవారం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ఒక్క నిమిషం పాటే కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, వాగ్వివాదాల గందరగోళం మధ్య ఒక నిమిషంలోనే గవర్నర్‌ లాల్జీ టాండన్‌ తన ప్రసంగాన్ని ముగించి, వెళ్లిపోయారు. ఆ తరువాత, సోమవారమే బల నిరూపణ జరగాలని బీజేపీ చీఫ్‌ విప్‌ నరోత్తమ్‌ మిశ్రా, సభలో విపక్ష నేత గోపాల భార్గవ డిమాండ్‌ చేశారు. అనంతరం, గందరగోళం మధ్యనే కరోనా వైరస్‌ ముప్పును శాసనసభ వ్యవహారాల మంత్రి గోవింద్‌ సింగ్‌ స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో సభను 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

గవర్నర్‌ వద్దకు బీజేపీ నేతలు: ఆ తరువాత, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నివాసానికి వెళ్లి, తక్షణమే విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించాలని అభ్యర్థించారు. మరోవైపు, కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పోలీసుల సాయంతో కర్నాటకలో బీజేపీ నిర్బంధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష రాజ్యాంగవిరుద్ధం అవుతుందని కమల్‌నాథ్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top