శాసనమండలి నిరవధిక వాయిదా

Legislative Council Postponed indefinitely - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఉభయసభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలి ఆదివారం సమావేశమైంది. ఒక్కరోజు జరిగిన సభలో 4.54గంటల పాటు గవర్నర్‌ ప్రసంగంలోకి అంశాలపై 18మంది సభ్యులు చర్చలో పాల్గొన్నట్టు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌పై అనర్హత వేటు వేసినట్టు చైర్మన్‌ తెలిపారు. 

గవర్నర్‌ ప్రసంగంపై సభ్యుల చర్చ...
సహకరిస్తాం.. కానీ: పొంగులేటి 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు, అభివృద్ధికి తాము సహకరిస్తామని, కానీ గవర్నర్‌ ప్రసం గంలో కొన్ని అర్ధసత్యాలు, కొన్ని అసత్యాలున్నాయని, వాటిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  

‘గాడిలో పడ్డ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ’
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ సీఎంగా రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కులాల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమగ్రసర్వేతో ఏ కులాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలన్న దానిపై అధ్యయనం చేసి పథకాలు రూపొందించారన్నారు.  

‘సమస్యలు తొలగిపోయాయి’
రాష్ట్ర ఏర్పాటు జరిగితే తెలంగాణ అంధకారంలో మగ్గిపోతుందన్న ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యల్ని పటా పంచలు చేయడంలో కేసీఆర్‌ కృషి ఎనలేనిదని ఎమ్మెల్సీలు సలీం, ఎంఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల్లో 60 ఏళ్ల సమస్యలన్నీ నాలుగున్నరేళ్లలో తొలగిపోయాయన్నారు. 

‘వ్యవసాయరంగంలో ఎనలేని అభివృద్ధి’
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఎనలేని అభివృ ద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్‌ సర్కార్, సీఎం కేసీఆర్‌ సఫలీకృతమయ్యారని ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, కృష్ణారెడ్డి ప్రశంసిం చారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని రైతుబంధు, రైతుబీమా తో దేశానికే రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. 

‘రైతులు వైఎస్, కేసీఆర్‌లను నమ్మారు’
రైతులు నమ్మిన నేతలే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారని ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డికి, రైతులకు 24గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు పథకాలిచ్చిన కేసీఆర్‌లు విజయం సాధించడమే దీనికి నిదర్శనమన్నారు.  

‘రైతులకు సంక్షేమాన్ని అందిస్తున్నారు’
రైతులకు సీఎం కేసీఆర్‌ సంక్షేమాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అందులో ఒకటి దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా సాగునీటి ప్రాజెక్టులతో నీళ్లందించడం, రెండోది తక్షణసాయం కింద రైతుబీమా, రైతు బంధుతో పాటు విత్తనాలు, ఎరువులివ్వడం చేస్తున్నారన్నారు. మైనారిటీలకు ఏ రాష్ట్రంలో లేని తీరుగా సంక్షేమ పథకాలను కేసీఆర్‌ అమలుచేస్తున్నారని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు అన్నారు.  

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు
రాష్ట్ర అభివృద్ది పథంలో పయనిస్తోందని, అందుకు కేసీఆర్, టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేస్తున్న కృషే నిదర్శనమని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించిన సభ్యులు, వారు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానాలు చెప్పారు.  కాగా, గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని పల్లారాజేశ్వర్‌రెడ్డి ప్రాతిపాదించగా, సభ ఆమోదిస్తున్నట్లు స్వామిగౌడ్‌ తెలిపారు. మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top