ఇదే క్లైమాక్స్!

Leader of the Opposition YS Jagan on AP Special Status fight - Sakshi

ప్రత్యేక హోదా పోరాటంపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులకు దిశానిర్దేశం.. 

5న ఢిల్లీలో ధర్నా.. 21న అవిశ్వాస తీర్మానం

చివరి అస్త్రంగా ఏప్రిల్‌ 6న ఎంపీల రాజీనామా.. 

స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖలు

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధిః ప్రత్యేకహోదా కోసం చేస్తున్న పోరాటం క్లైమాక్స్కు చేరుకుందని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ప్యాకేజీతో మోసం చేయవద్దు. ప్రత్యేక హోదా మన హక్కు’ అనేదే మన నినాదం అని ఆయన పేర్కొన్నారు. ఈనెల 5న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు వెళుతున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజక వర్గాల సమన్వయ కర్తలకు ఈమేర కు జగన్‌ దిశానిర్దేశం చేశారు. వారితో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ, తాళ్లూరు మండలం శివరాంపురం వద్ద జగన్‌ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా పోరాటం క్లై్లమాక్స్‌కు చేరుకుం దని, ఆ పోరాటంలో భాగంగానే ఈనెల 1న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశామని, ఈనెల 5న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నా మంటూ తుదిదశ పోరాట ప్రణాళికను ఆయన వివరించారు. ‘విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి, ప్రధాని ఇచ్చిన హామీలు అన్నీ మనకు హక్కుగా రావాల్సిందే. ఈ పోరాటంలో యావత్‌ పార్టీ ఢిల్లీలో ఉంటుంది. పార్టీ నాయకత్వం నుంచి శ్రేణుల వరకు అందరూ మీ వెంట ఉంటారు. పార్లమెంటులో ఉధృతంగా పోరాటం చేయండి’ అని ఎంపీలకు సూచించారు. ఇంకా ఆయనేమన్నారంటే..

మన చిత్తశుద్ధికి నిదర్శనం.. 
ఈనెల 5 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ మలివిడత సమావేశాలు ప్రారంభమవు తాయి. ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చా ల్సిందిగా కోరుతూ మన పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తారు. ఈనెల 20 వరకు పార్లమెంటులో ఆందోళన చేస్తాం. అర్థిస్తాం. అందరికీ విజ్ఞప్తు లు చేస్తాం. అప్పటికీ హోదా ఇవ్వకపోతే ఈనెల 21న కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాం. బాబుగారి పార్ట్ట్‌నర్‌ పవన్‌ కల్యాణ్‌ ఉద్దేశాలేంటో మనకు తెలియవు. ఆయనిచ్చిన సలహాను స్వీకరిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం. కానీ చంద్రబాబు మాత్రం తన పార్ట్ట్‌నర్‌ ఇచ్చిన సలహా ప్రకారం అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడాన్ని బట్టి ఆయన చిత్తశుద్ది ఏమిటో మరోసారి స్పష్టమ య్యింది. బాబు వద్ద నున్న 20 మంది ఎంపీ లు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేలా చూడాల్సి న బాధ్యత చంద్రబాబు పార్టనర్‌పై ఉంది. ప్రత్యేక హోదాపై పోరాటం విషయంలో వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోంది. అందుకు నిదర్శనమే అవిశ్వాస తీర్మానం.

స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎంపీల రాజీనామాలు
పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 184 నిబంధన కింద ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చకు యత్నిస్తున్నారు. దీంతోపాటు అవిశ్వాస తీర్మానం సందర్భంగా వచ్చే చర్చ సమయం లోనూ మన గళాన్ని గట్టిగా వినిపిస్తాం. ఏప్రిల్‌ 5 వరకు చూద్దాం. ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 5 వరకు పోరాటం కొనసాగుతుంది. ఏప్రిల్‌ 6న మన ఎంపీలు స్పీకర్‌ ఫార్మాట్‌లో లోక్‌సభకు రాజీనామా చేస్తారు. మన ఎంపీలకు పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణులు అండగా ఉంటా రు. ప్రజలు వారిని ఆదరిస్తారు. చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం పోరాటం చేస్తున్నాం. ప్రజలూ మనపైనే నమ్మకం పెట్టుకున్నారు. 

వైదొలగడమే తొలి అస్త్రం కావాలి బాబూ
హోదాపై పోరాటం ఉధృతంగా నడుస్తున్న సమయంలో ప్రజలను అయోమయానికి గురి చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా కేంద్రం నుంచి వైదొలగడం చంద్రబాబు తొలి అస్త్రం కావాలి. ఎంపీలతో రాజీనామా చేయించడం రెండో అస్త్రం కావా లి. కానీ కేంద్ర మంత్రిపదవులకు తమ ఎంపీ లు రాజీనామా చేయడం చంద్రబాబు ఆఖరి అస్త్రంగా చెబుతున్నారంటే ప్రత్యేక హోదాపై ఆయనకున్న వైఖరి దాని అంతరార్థం ఇట్టే తెలిసిపోతున్నాయి. రూపాయో అర్ధరూపా యో తక్కువ అయిందన్నట్టుగా బాబు మాట్లా డుతున్నారు. ఆంధ్రా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మనది ఒకటే నినాదం ‘‘ప్యాకేజీతో మోసం చేయొద్దు – హోదా మన హక్కు’’. అలాగే విభజన హామీల విషయంలోనూ మనకు రెండో ఆలోచన లేదు. చట్టంలో పేర్కొన్న ప్రకారం, అప్పటి ప్రధాని ఇచ్చిన  ప్రకటన ప్రకా రం నూరు శాతం హామీలను నెరవేర్చా ల్సిందే. హోదా విషయంలో క్లైమాక్స్‌కు సిద్ధమైన పార్టీ శ్రేణులకు నా శుభాకాంక్షలు. 

వేటు వేసే దాకా అసెంబ్లీ బహిష్కరణే..
పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోము. చంద్రబాబు తాను కొనుగోలు చేసిన 22 మంది ఎమ్మెల్యేలలో నలుగురిని మంత్రులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేశారు. దగ్గరుండి గవర్నర్‌ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది ప్రజా స్వామ్యాన్ని హననం చేయడమే. వచ్చే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షం గైర్హాజరు కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఏపీలో ప్రజాస్వామ్యం పరిహాసం అవుతున్న తీరు, రాజ్యాంగ ఉల్లంఘనలపై మరోసారి గట్టి చర్చ జరుగుతుంది. ప్రతిపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను బాబు కొనుగోలు చేసిన వ్యవహారాన్ని పాదయాత్రలో ప్రజలకు వివరిస్తున్నాం. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ప్రజలు ఎండగడుతున్నారు.

ఇప్పటికీ ప్రలోభ పెడుతున్నారు...
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి చంద్ర బాబు ఇంకా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రతి కదలిక నాకు తెలుసు. ప్రస్తుతం మనకు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవంగా బాబు రాజ్యసభకు పోటీపెట్టకుండా.. ఏకగ్రీ వంగా ఎన్నిక జరిగేలా చూడాల్సిందిపోయి... ఇప్పుడు మళ్లీ ప్రలోభాలకు దిగుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీగా ఆఫర్లు ఇస్తున్నా రు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుం ది?  ఇప్పుడున్న ఎమ్మెల్యేలు... ఆ ఆఫర్లను తిరస్క రించి చిత్తశుద్ధితో, నిజాయితీగా వ్యవహరిస్తు న్నారు. దీంతో వారి పట్ల ఉన్న గౌరవం మరింత పెరిగింది. ప్రతి విషయంలో నూ నిజాయితీ ఉన్నాం. చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం.. విలువలు, విశ్వసనీయతే వైయస్సార్‌సీపీ సిద్ధాంతం’’ అని జగన్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని  పరిచయం చేశారు.

ఆల్‌ ద బెస్ట్, గుడ్‌ లక్‌..
అనంతరం ఢిల్లీ బయలుదే రిన పార్టీ ప్రజాప్రతినిధుల బృందానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతా మంచే జరుగుతుంది అంటూ వీడ్కోలు పలికారు. ఢిల్లీ వీధుల్లో తెలుగోడి ఆత్మగౌరవం ప్రతిధ్వనించాలన్నారు. జగన్‌ జెండా ఊపిన అనంతరం నేతలంతా కార్లలో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా జగన్‌ సహా పార్టీ నేతలంతా చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు.

ప్రత్యేక హోదా నినాదంతో ఢిల్లీలో ధర్నా: మేకపాటి
పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్యాకేజీ మాకొద్దు అనే నినాదంతో ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వివరించారు. వైయస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసిన అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో చెప్పిన అన్ని అంశాలను తూచ తప్పకుండా అమలు చేయాలని గట్టిగా నినదించనున్నామన్నారు. హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు మాట మార్చారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తుల్లో ప్రథముడు చంద్రబాబేనన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం ప్రత్యేక హోదాను కాలరాశాడని మండిపడ్డారు.  ఆంధ్రుల హక్కును కేంద్రానికి గుర్తు చేసేందుకు గాను 5వ తేదీన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నామన్నారు.

ధర్నా అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలంతా పార్లమెంట్‌లో అన్ని విధాలుగా పోరాటం చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రం చేసిన అన్యాయాన్ని ఎండగడతామన్నారు. 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టనున్నామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని మేకపాటి అన్నారు. వాళ్లు రాజీనామా చేసేంత వరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామన్నారు. గత అసెంబ్లీ సమావేశాలను కూడా ఇదే డిమాండ్‌తో బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇంకేమన్నా కుట్రలు చేసి ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే ఆయన కొంపే కొల్లేరు అవుతుందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో ఉన్న 44 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు శాసన మండలి సభ్యులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. అవిశ్వాసానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, పవన్‌ కళ్యాణ్‌ ఏవిధంగా సహకరిస్తారో చూడాలన్నారు. చంద్రబాబు రాజీనామాలు చేయిస్తామన్నారు, తర్వాత లేదన్నారు. ఆయన చేష్టలు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి నీతిమాలిన పనులు, విన్యాసాలు చేస్తారో చూస్తామన్నారు. ఎమ్మెల్యేలు తన దృష్టిలో ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు మేకపాటి వివరించారు. అసెంబ్లీ సీట్లు పెంపు లేదని కేంద్రం చెప్పిందని, ఇకనైనా చంద్రబాబు నీతిమాలిన పనులు మానుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న చంద్రబాబు మాటలు: బుగ్గన
ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సమావేశాల్లో చెబుతున్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. పాదయాత్ర శిబిరం వద్ద ఆయన శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది పార్లమెంటు సాక్షిగా నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ దానిని సాధించడంలో విఫలమైందన్నారు. విభజన హేతుబద్ధంగా లేదని పొద్దస్తమానం ముఖ్యమంత్రి చెప్పుకుంటూ పోతున్నారని, ప్రత్యేక హోదాపై పూటకోమాట మాట్లాడుతున్నారని బుగ్గన విమర్శించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top