ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా లలితకుమారి

Lalitha Kumari Participated as Independent Candidate in Chittoor - Sakshi

ఫలించని మంత్రి మంతనాలు

ఆందోళనతో అనారోగ్యానికి గురైన టీడీపీ అభ్యర్థి పూర్ణం

బంగారుపాళ్యం/యాదమరి: పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి టీడీపీ అధిష్టానం టికెట్‌ కేటాయించకపోవడంతో ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మంత్రి అమరనాథరెడ్డి మంగళవారం అర్ధరాత్రి వరకు మంతనాలు జరిపినా ఆమె, ఆమె వర్గీయులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ టికెట్‌ దక్కించుకున్న పూర్ణం ఆందోళనతో అనారోగ్యానికి గురై ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు నెలల క్రితం సీటు నీకేనంటూ పార్టీ అధిష్టానం చెప్పడంతో లలితకుమారి వర్గం ఆశలు పెంచుకుంది. తీరా అధిష్టానం తవణంపల్లె మండలానికి చెందిన పూర్ణంకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. దీంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. మంత్రి మంతనాలు జరిపినా శాంతించలేదు.

పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని, ఈ నెల 22న ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేస్తానని లలితకుమారి బుధవారం స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా లాభం లేకపోయిందని ఆమె వాపోయారు. మంత్రి నచ్చచెప్పినా లలితకుమారి వినకపోవడంతో టీడీపీ అభ్యర్థి పూర్ణం ఆందోళనకు గురై చాతినొప్పితో ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు ఎలాంటి ఇబ్బందీ లేదని రాత్రికి రాత్రే ఇంటికి పంపినట్లు సమాచారం. ఇదిలావుండగా గ్రామాల్లో పర్యటించినా ఎవరూ సహకరిం చకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవాలని భావించి బుధవారం బీ ఫారం తీసుకోవడానికి కూడా వెళ్లలేదని సమాచారం. దీంతో టీడీపీ అధిష్టానం అభ్యర్థి విషయం మళ్లీ అయోమయంలో పడింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top