హ్యాపీగా లేను.. వేదికపైనే ఏడ్చేసిన సీఎం

Kumaraswamy Cries Says Unhappy with coalition govt - Sakshi

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి అయినందుకు కార్యకర్తలంతా ఆనందంగా ఉన్నారని, కానీ, సంకీర్ణ ప్రభుత్వం నేపథ్యంలో తాను మాత్రం చాలా బాధతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

సాక్షి, బెంగళూరు: జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఓ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు.  ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను’’ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా తానెక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, అదేమీ అదృష్టమో కానీ తన పార్టీ సభ్యులకు మాత్రం ఓట్లు వేయడాన్ని మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయని అన్నారు. ‘‘దేవుడైతే నాకీ అధికారం (సీఎం పదవి) ఇచ్చాడు. నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు’’ అని కుమారస్వామి పేర్కొన్నారు. వేదికపైకి వెళ్లేముందు కుమారస్వామి బొకేలు తీసుకోవడానికి, పూలదండలు వేయించుకోవడానికి ఆయన నిరాకరించారు. 

సోషల్‌ మీడియా పోస్టులతో మనస్థాపం... ఇదిలా ఉంటే బడ్జెట్‌లో కోస్తా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. కుమారస్వామి నాట్‌ మై సీఎం పేరిట ఓ క్యాంపెయిన్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. మంగళూరు తదితర కోస్తా ప్రాంతాలకు తీరని అన్యాయం చేసారని, ముఖ్యంగా రుణమాఫీ విషయంలో మత్య్సకారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ‘సోషల్‌ మీడియాలో పోస్టులు నన్ను బాధిస్తున్నాయి. రుణమాఫీ గురించి అధికారులతో ఎంతగా వాదులాడానో మీకేం తెలుసు. అన్నభాగ్య స్కీమ్‌ కింద 5 కిలోల బియ్యం బదులు, ఏడు కిలోల బియ్యం అడుగుతున్నారు. అదనంగా రూ. 2500 కోట్లు ఖర్చవుతుంది. అదంతా ఎవరు భరిస్తారు. పోనీ టాక్స్‌ల రూపంలో వసూలు చేద్దామా? అంటే తిరిగి ప్రభుత్వానే విమర్శిస్తారు. మీరైతే రుణమాఫీ విషయంలో సీఎంకే స్పష్టత లేదంటూ కథనాలు ప్రచురిస్తున్నారు’ అంటూ మీడియాను ఉద్దేశించి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top