ఏకగ్రీవానికే కాంగ్రెస్‌ మొగ్గు

KTR talks with Uttam and Bhatti about Deputy speaker election - Sakshi

డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికపై ఉత్తమ్, భట్టిలతో కేటీఆర్‌ చర్చలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ గురించి అడిగిన కాంగ్రెస్‌ నేతలు

అది సీఎం నిర్ణయమన్న కేటీఆర్‌... 

ఫోన్‌ ఎత్తకపోవడంపై ఉత్తమ్,కేటీఆర్‌ల మధ్య ఆసక్తికర చర్చ

సాక్షి, హైదరాబాద్‌: డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగీవ్రంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలబెట్టినా గెలిచే బలం లేకపోవడంతోపాటు తమ అభ్యర్థికి మద్దతివ్వాలని మర్యాదపూర్వకంగా అధికార పార్టీ నుంచి వచ్చిన విజ్ఞప్తిపట్ల సానుకూలంగా స్పందించాలని నేతలు నిర్ణయించారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కాంగ్రెస్‌ ముఖ్యనేతలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు కోరారు. 

ఉత్తమ్‌ కోసం వేచి చూసి..!
డిప్యూటీ స్పీకర్‌గా టీఆర్‌ఎస్‌ పక్షాన పద్మారావు బరిలో ఉంటున్నారని, ఆయనకు మద్దతిచ్చి డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరేందుకు కేటీఆర్‌ శనివారం ఉదయం 9:30 గంటల సమయంలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. మంత్రులు తలసాని, ప్రశాంత్‌రెడ్డిలతోపాటు డిప్యూటీ స్పీకర్‌ అభ్యర్థి పద్మారావు కూడా కేటీఆర్‌తో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మంత్రులు, పద్మారావు వెళ్లిపోగా కేటీఆర్‌ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. అయితే, ఉత్తమ్‌ రావడం ఆలస్యం కావడంతో అరగంటకుపైగా ఆయన కోసం కేటీఆర్‌ ఎదురుచూశారు. తర్వాత ఉత్తమ్, భట్టితో చర్చలు జరిపారు. స్పీకర్‌ ఎన్నిక తరహాలోనే డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కూడా ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికపై ముగ్గురు నేతల మధ్య చర్చ వచ్చింది. సంఖ్యాబలం ప్రకారం తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుందని, టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు అభ్యర్థులను ప్రకటించి, మరో స్థానం ఎంఐఎంకు ఎలా ఇస్తారని కేటీఆర్‌ను ఉత్తమ్, భట్టి ప్రశ్నించారు. అయితే, అది సీఎం కేసీఆర్‌ నిర్ణయమని కేటీఆర్‌ దాటవేసినట్టు తెలుస్తోంది. 

నంబర్‌ బ్లాక్‌ చేశావా?
ఫోన్‌ ఎత్తకపోవడంపై ఉత్తమ్, కేటీఆర్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎల్పీ కార్యాలయంలోకి వస్తూనే ఆలస్యమైనందుకు క్షమించాలన్న ఉత్తమ్‌ ‘నా నంబర్‌ బ్లాక్‌ చేశావా’ అని కేటీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటిదేమీ లేదని కేటీఆర్‌ సమాధానం ఇవ్వగా, తాను ఫోన్‌ చేస్తున్నా లిఫ్ట్‌ చేయడం లేదని, తానేమో ప్రయత్నిస్తున్నానని అన్నారు. తాను ఫోన్లో మెసేజ్‌లు మాత్రమే చూస్తానంటూ ‘మీ నంబర్‌ నేను బ్లాక్‌ చేయగలనా?’ అని కేటీఆర్‌ చమత్కరించారు. ఆ తర్వాత ముగ్గురు నేతలు రాజకీయ చర్చల్లోకి వెళ్లారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top