16 ఇస్తే ఢిల్లీని శాసించలేమా? | KTR Comments About Rahul Gandhi And Narendra Modi | Sakshi
Sakshi News home page

16 ఇస్తే ఢిల్లీని శాసించలేమా?

Mar 17 2019 2:44 AM | Updated on Mar 17 2019 2:45 AM

KTR Comments About Rahul Gandhi And Narendra Modi - Sakshi

నల్లగొండ సమావేశంలో ప్రసంగిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ తదితరులు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ చేతికి 16 మంది ఎంపీలను ఇస్తే ఏం చేస్తారో దేశ ప్రజలు చూస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. కేవలం టీఆర్‌ఎస్‌లో మాత్రమే సత్తా ఉన్న నాయకులు ఉన్నారని, అందుకే ప్రజలు రెండోసారి కూడా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా పోరాడే సత్తా టీఆర్‌ఎస్‌ నాయకుల్లో మాత్రమే ఉందన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం నరేంద్ర మోదీ హవా ఉందని, మూడు సార్లు గుజరాత్‌కు సీఎంగా పనిచేసిన మోదీ మీద నమ్మకంతో దేశ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. అయితే ఏదో జరుగుతుందని ప్రజలంతా ఆశించారని, కానీ ఐదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఏమీ చేయలేదని, మాటలకు, నినాదాలకే పరిమితమైందని దుయ్యబట్టారు.

మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు, అన్ని అధ్యయనాల్లో ఎన్డీయే కూటమికి ఈ సారి 150 నుంచి 160 సీట్లు కూడా వచ్చేలా లేవని తెలుస్తోందని, దీన్ని బట్టి ప్రధాని మోదీ మీటర్‌ తగ్గినట్లు స్పష్టం అవుతోందని అన్నారు. అలా అని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూడా బలం పుంజుకోలేదని, 2014 ఎన్నికల్లో కేవలం 44 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, యూపీఏ కూటమికి ఈ సారి 100 నుంచి 110 సీట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలంతా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. 

ఎక్కువ సీట్లు గెలిస్తే.. దేశ రాజకీయాల్లో మనమే కీలకం  
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలు గెలిస్తే దేశ రాజకీయాల్లో మనమే కీలకమవుతామని, రాష్ట్రానికి అవసరమైన నిధులను రాబట్టుకోవచ్చని కేటీఆర్‌ అన్నారు. అభివృద్ధి చేస్తారని గత ఎన్నికల్లో మోదీకి అవకాశమిస్తే.. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్లుగా ఆయన పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికలనగానే, బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ అని కొందరు అంటున్నారని, మోదీ, రాహుల్‌ను మాత్రమే ప్రజలు ఎన్నుకోవాలా అని నిలదీశారు. 71 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని, అయినా దేశంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్‌ అని, అలాంటిది 16 మంది ఎంపీలు మనవాళ్లే ఉంటే కేంద్రాన్ని శాసించలేమా అని అన్నారు.  

దేశానికి అంత ఖర్మ పట్టలేదు 
ఈ పార్లమెంటు ఎన్నికలను మోదీ వర్సెస్‌ రాహుల్‌ గాంధీగా చిత్రీకరించేందుకు చూస్తున్నారని, ఆ ఇద్దరిని మాత్రమే ఎంచుకోవాల్సిన ఖర్మ దేశ ప్రజలకు పట్టలేదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిలో జవాన్లు చనిపోతే సీఎం కేసీఆర్‌ స్పందించిన రీతిలో ఎవరూ స్పందించలేదన్నారు. వారం రోజులపాటు రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకున్నామని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ మాత్రం రాజకీయాలు చేయకుండా ఆగలేక పోయారని దుయ్యబట్టారు.  

మన పథకాలను కాపీకొట్టారు.. 
కేసీఆర్‌ ఆలోచనలు, ఆయన మానస పుత్రికలైన పథకాలను దేశం యావత్తూ అనుసరిస్తోందన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రధాని సహా అన్ని రాష్ట్రాల సీఎంలు కాపీ కొట్టారని కేటీఆర్‌ అన్నారు. రైతుబంధు పేరు మార్చి ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ పథకం అమలు చేసు ్తన్నారని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌ది కాదా! అని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే దండగన్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేకున్నా అనివార్యంగా మన పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీలో ప్రవేశ పెట్టలేదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఎంపీ సీటు ఎంతో కీలకమన్నారు. రైల్వే మంత్రి ఎవరైతే వాళ్ల ప్రాంతానికి రైళ్లు పోతున్నాయని, ప్రధాని గుజరాత్‌కి చెందిన వ్యక్తి కావడం వల్లనే బుల్లెట్‌ రైలు గుజరాత్‌ మీదుగా ముంబైకి పోతోందన్నారు.

నిరాశలో కాంగ్రెస్‌.. 
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 103 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్‌ రాలేదని కేటీఆర్‌ అన్నారు. టీడీపీ తట్టాబుట్టా సర్దుకుని అమరావతికి పోయిందన్నారు. కాంగ్రెస్‌ నైరాశ్యంలో కూరుకుపోయిందని, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ ఉంటే మళ్లీ చావుదెబ్బ తప్పదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే పేర్కొన్నారని అన్నారు.

జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు?
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో జరిగిన వివక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు గానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు గానీ జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్, ప్రధానిని అడిగితే శాలువా కప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వారన్నారు. అందుకే 16 మంది ఎంపీలు టీఆర్‌ఎస్‌ నుంచి గెలిస్తే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రాదా.. అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే ఏమీ కాదని, వారిపని రాహుల్‌ గాంధీ సిట్‌ అంటే సిట్‌ .. అని వ్యాఖ్యానించారు. అదే టీఆర్‌ఎస్‌ నాయకులు పేగులు తెగేదాకా కొట్లాడతారని పేర్కొన్నారు. నల్ల గొండ పార్లమెంటు స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో గెలవాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, నోముల నర్సింహయ్య, ఎన్‌.భాస్కర్‌ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement