
సాక్షి, అమరావతి : శాసనమండలిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీడీపీ వ్యవహరించిందని ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి వేటు వంటిదని అభివర్ణించారు. శాసనమండలి కేవలం శాసనసభ చేసిన బిల్లులను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడే విధంగా సూచనలు సలహాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయిదవ తరగతి కూడా చదువుకోలేదని, దుర్గ గుడి వద్ద కొబ్బరి చిప్పలు అమ్ముకొని రౌడీయిజం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇలాగే ఉంటదని ద్వజమెత్తారు.(‘ముస్లింల గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’)
చంద్రబాబునాయుడు తన స్థాయి దిగజారిపోయి మండలి స్పీకర్‌ను ప్రభావితం చేశారని విమర్శించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నామని చెప్పిన మండలి చైర్మన్.. వికేంద్రీకరణ బిల్లును సెలక్షన్ కమిటీ పంపించడం సమంజసం కాదని పేర్కొన్నారు. చంద్రబాబు ఓత్ ఆఫ్ సిక్రెస్సీ అనే నిబంధనను పక్కన పెట్టి, అమరావతి భూకుంభకోణానికి తెర తీసారని దుయ్యబట్టారు. రాష్ట్ర సర్వతోముఖావృద్దికి మూడు రాజధానుల నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకుందన్నారు.ప్రజల సంక్షేమానికి అవరోధంగా మారిన శాసనమండలిని కోనసాగించాలా లేదా అనే అంశానికి సంబంధించి 27వ తేదీన శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. (జనవరి 27న ఏపీ కేబినెట్ భేటీ)
అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన చేస్తున్న అంశాలు పరిగణించకుండా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. అమరావతిని తరలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పిన పవన్ ఇప్పుడు రాజధాని తరలింపు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని చెప్పడం తమ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు,కర్నూల్‌ను రాజధానిగా ఏర్పాటు చెస్తానని చెప్పిన మీరు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విద్యా, వైద్య రంగాలలో విప్లవత్మకమైన మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవం దేనికి ఉపయోగపడటం లేదని,. అధికారం వచ్చిన ప్రతిసారీ అవినీతిని పెంచిపోషిస్తున్నాని కొట్టు సత్యనారాయణ విమర్శించారు.