ప్రధానిని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy Met PM Narendra Modi - Sakshi

నాలుగు అంశాలపై వినతి పత్రాలు

ప్రాజెక్టుల్లో అవినీతిపై ఫిర్యాదు  

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని మంగళవారం ఇక్కడ కలిశారు. నాలుగు అంశాలపై ఆయన ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేయడంతో పాటు, తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లో వందల కోట్ల మేర అవినీతి జరుగుతోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ. 64 వేల కోట్ల రుణం తీసుకుని, ఆ నిధులను యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజె క్టు నిర్మాణంలో నామినేషన్ల ద్వారా కొన్ని కంపెనీలకు కట్టబెట్టారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని కోరినట్టు సమాచారం.
 
ఫార్మాసిటీకి అనుమతులు నిరాకరించండి 
హైదరాబాద్‌లో ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులను నిలిపివేయాలని కోమటిరెడ్డి మోదీని కోరారు. హైదరాబాద్‌ సమీపంలో కాకుండా మరోచోట ఫార్మాసిటీ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై మోదీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

మూసీ నది అనేక రసాయనాలతో కలుషితమైం దని, నమామీ గంగే తరహాలో మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రూ.3 వేల కోట్లతో మూసీ నదిని సమూలంగా శుభ్రం చేయా లని కోరారు. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీరు ఇంకా అందడం లేదని, జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా నిధులు కేటాయించాలని విన్నవించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top