టీడీపీలో పదవుల రచ్చ, కేశినేని నాని ఆగ్రహం 

Kesineni Nani Sensational Comments On Chandrababu Naidu - Sakshi

గల్లాకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ పదవి ఇవ్వడంపై కేశినేని అలక

ఆయన తల్లికి పొలిట్‌బ్యూరో, ఆయనకు పార్టీ పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం 

పైగా బీజేపీలో చేరుతున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేశినేని ఆగ్రహం  

సాక్షి, అమరావతి:  చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన ముగ్గురు ఎంపీలు పదవుల కోసం రచ్చకెక్కడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. చంద్రబాబు ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక వహించి ఫేస్‌బుక్‌లో వెటకారంగా పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లోక్‌సభలో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, పార్టీ విప్‌గా తనకిచ్చిన పదవులను తిరస్కరిస్తున్నానని, అంత పెద్ద పదవులు చేపట్టే అర్హత తనకు లేదని, ఆ పదవులు తీసుకోలేకపోతున్నందుకు చంద్రబాబు తనను క్షమించాలని కేశినేని నాని బుధవారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా గల్లా జయదేవ్‌ను నియమించడంపై అసంతృప్తితో ఉన్న నాని బీజేపీలోకి ఫిరాయిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం జరిగిన టీడీపీ నాయకుల సమావేశానికి ఆయన్ను పిలిచి లోక్‌సభలో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, విప్‌ పదవులు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అవి తనకు వద్దని చెప్పిన నాని బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ చంద్రబాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే తాను బీజేపీలో చేరతానని సంచలనంగా వ్యాఖ్యానించారు.  
ఫలించని బుజ్జగింపు యత్నాలు 
నాని తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సాయంత్రం ఆయన్ను పిలిపించుకుని బుజ్జగించడంతోపాటు గల్లా జయదేవ్‌తో రాజీ చర్చలు జరిపారు. అయినా పట్టించుకోని నాని గల్లా జయదేవ్‌ తల్లి ఇప్పటికే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్నారని, మళ్లీ జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎలా నియమిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. బీసీ నేత కింజరాపు రామ్మోహన్నాయుడికి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అవకాశం ఇస్తే బాగుండేదని చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు తనకు మాట్లాడే అవకాశం వస్తే పార్టీ నిర్ణయం అంటూ జయదేవ్‌తో మాట్లాడించారని గతంలో జరిగిన ఘటనలు సైతం ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. అన్నీ విన్న చంద్రబాబు జరిగిన దాని గురించి పట్టించుకోవద్దని, ఇకపై పార్టీలో ప్రాధాన్యం ఇస్తానని చెప్పి బుజ్జగించినట్లు తెలిసింది. 

చంద్రబాబుతో సమావేశం తర్వాత బయటకు వచ్చిన జయదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో మాట్లాడే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో తనకు పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం ఇవ్వాలని కోరి తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి ఆ పదవుల్లో మార్పు లేదని, కానీ తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని మార్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే పార్టీకి మిగిలిందే ముగ్గురు ఎంపీలైతే వారు పదవుల కోసం రోడ్డెక్కడం ఏమిటని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ముగ్గురి మధ్య చంద్రబాబు పదవులు పంచలేకపోవడం, సమన్వయం చేయలేకపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top