గులాబీ ప్రచార భేరి

KCR Plans Election Campaign In District Wise Around Telangana - Sakshi

నేటి నుంచి టీఆర్‌ఎస్‌ అధినేత పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారం

నిజామాబాద్‌లో నేడు భారీ బహిరంగ సభ

వరుసగా 5 ఉమ్మడి జిల్లాల్లో సభలు

గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రగతి, సంక్షేమ పథకాల వివరణ

మళ్లీ ఆశీర్వదించాలని విన్నపం

పెండింగ్‌లో ఉన్న 14 స్థానాల జాబితాపై ఇంకా అస్పష్టత

ప్రచారం చేయవద్దని మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డికి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి పార్టీలకంటే ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలోనూ దూకుడు ప్రదర్శించనుంది. విపక్షాలకంటే ముందే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బహిరంగ సభతో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు బుధవారం నుంచి పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలవాల్సిన ఆవశ్యకతను తెలపనున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని బహి రంగ సభ వేదికగా ప్రజలను కోరనున్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని పదేపదే అడ్డుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని ప్రజలకు వివరించనున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పుతో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే స్వాభిమానంతో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుం దని హామీ ఇవ్వనున్నారు. మొత్తంగా టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలతో ఎన్నికల్లో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది.

వరుసగా సభలు..
ఉమ్మడి జిల్లాలవారీగా సభలు నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్‌ సభ అనంతరం ఈ నెల 4న నల్లగొండలో, 5న వనపర్తిలో, 7న వరంగల్, 8న ఖమ్మంలో ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు నిర్వహించనుంది. బహిరంగ సభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లాల మంత్రులు, పలువురు అభ్యర్థులతో ఇప్పటికే ఫోన్లలో మాట్లాడారు. బహిరంగ సభలకు జనం త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు.

అసంతృప్తులు ఆగినట్లేనా...
ప్రత్యర్థి పార్టీలను, సొంత పార్టీ వారిని ఆశ్చర్యపరుస్తూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ రద్దయిన రోజే 105 స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని అసంతృప్తి నేతలు డిమాండ్‌ చేశారు. అభ్యర్థులకు సహకరించేది లేదంటూ ప్రకటించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ చొరవతో నియోజకవర్గాలవారీగా అసమ్మతి, అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారు. టికెట్లు ఖరారైన మరుసటి రోజు నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మంది నేతలు ఇప్పటికే కేటీఆర్‌తో చర్చించి వెళ్లారు. కొందరు నేతలు మాత్రం స్వతంత్రులుగా పోటీ చేస్తామని ప్రకటించి సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి స్థానాలు దాదాపు 10 వరకు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అధినేత వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బహిరంగ సభల నిర్వహణలో, ఆయా నియోజకవర్గాల జనసమీకరణ విషయంలో వారి వైఖరి ఆధారంగా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

పెండింగ్‌ జాబితాపై అస్పష్టత...
టీఆర్‌ఎస్‌ మరో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ప్రచారం మొదలుపెడుతున్నా అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఆయా సెగ్మెంట్లలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆశావహులు తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్తుంటే తమ సెగ్మెంట్లలో పార్టీపరంగా ఇబ్బందులు నెలకొంటున్నాయని అంటున్నారు. ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణకు ముందు అభ్యర్థులను ప్రకటించేలా టీఆర్‌ఎస్‌ కసరత్తు పూర్తి చేసింది. అయితే మహాకూటమిలో పార్టీలవారీగా సీట్ల సర్దుబాటుతో తలెత్తే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అందుకే పెండింగ్‌ సీట్ల అభ్యర్థుల ఖరారులో జాప్యం చేస్తోంది.

ఎంపీ మల్లారెడ్డి ప్రచారానికి బ్రేక్‌...
టీఆర్‌ఎస్‌ పెండింగ్‌లో పెట్టిన మేడ్చల్‌ అభ్యర్థి ఖరారులో రోజురోజుకూ పరిణామాలు మారుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం. సుధీర్‌రెడ్డికి తొలి జాబితాలో స్థానం దక్కలేదు. అదే సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి తనకు అధిష్టానం అవకాశం ఇచ్చినట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే మల్లారెడ్డి ప్రచార నిర్వహణపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ప్రచారం ఆపేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. దీంతో మేడ్చల్‌ అభ్యర్థి ఎవరనేది మళ్లీ మొదటికి వచ్చింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top