‘కాళేశ్వరంతో సస్యశ్యామలం’

Kcr: Kaleshwaram Will Be The Key Factor For Farming - Sakshi

సాక్షి మెదక్‌/ నర్సాపూర్‌: రాబోయే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నర్సాపూర్‌ వెల్దుర్తి మార్గంలో పట్టణ శివారులో బుధవారం ఏర్పాటు చేసిన మెదక్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మంజీర నది, హల్దీ వాగులు మెదక్‌ జిల్లాకు దేవుడు, ప్రకృతి ఇచ్చిన వరంలాంటివని అన్నారు. వాటిని సజీవ నదులుగా మార్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. సమైఖ్య రాష్ట్రంలో మంజీర నది అభివృద్ధి పట్ల అప్పటి పాలకులు వివక్ష చూపించారని ఆరోపించారు. తాగునీరు, సాగునీరు, కరెంటు కోసం ఎన్నో కష్టాలు పడ్డామని.. దేవుని దయ.. మీ అందరి దీవెనలతో ఇప్పటికే వాటిని అధిగ మించామన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు సాగుకు వస్తాయని చెప్పారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. కాళేశ్వరం నీటితో సింగూరును నింపుతామని చెప్పారు. ఇప్పటికే నర్సాపూర్‌ నియోజకవర్గం పరిధిలో మంజీర, హల్దీ వాగులపై 14 చెక్‌డ్యాంలు మంజూరు చేశామని, నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో చిన్నచిన్న పనులు మిగిలాయని, అన్నీ త్వరలో పూర్తవుతాయన్నారు. పనులు పూర్తి కాగానే ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉన్న పది స్థానాల్లో తొమ్మిది చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించారని ఆయన గుర్తు చేశారు.

మెదక్‌ చైతన్యవంతమైన జిల్లా..
మెదక్‌ జిల్లాను సీఎం కేసీఆర్‌ చైతన్యవంతమైన, పోరాట పటిమ గల జిల్లాగా అభివర్ణించారు. తనకు రైతుల కష్టాలు తెలుసని పేర్కొంటూ రైతుల అప్పులు పోయి ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో రూ.మూడు, రూ.ఆరు, రూ.పది, రూ.15లక్షలు జమ అయినప్పుడే బంగారు తెలంగాణ అయినట్లని కేసీఆర్‌ తెలిపారు. అందుకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నామని, రైతులు చనిపోతే ఆ కుటంబాలకు రైతుబీమా పథకం కింద ఆర్థిక సహాయం అందజేసి ఆదుకుంటున్నామని ఈ పథకం ఏ రాష్ట్రంలో లేదన్నారు. మన రైతుబంధు పథకంలో ప్రధాని నరేంద్రమోదీ పావలా నకలు కొడుతున్నారని ఆరోపించారు. కుల వృత్తులను అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. నాలుగున్నరేళ్ల కాలంగా నోరు, కడుపు కట్టుకుని కష్టపడి పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. గిరిజన తండాలు గ్రామ పంచాయతీలు కావాలన్న గిరిజనుల కోరిక మేరకు రాష్ట్రంలో తండాలను పంచాయతీలుగా మార్చామని సీఎం చెప్పారు. 

‘కొత్త’కు ఐదు లక్షల మెజారిటీ దాటాలి 
మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి చాలా ఉత్తముడని పేర్కొన్నారు. మియాపూర్‌ వరకు ఉన్న మెట్రో రైలును పటాన్‌చెరు వరకు, రామచంద్రాపురం వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ను సంగారెడ్డి వరకు పొడిగించేందుకు తన సహాయం కావాలని ఎంపీ కోరారని తప్పకుండా సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఐదు లక్షల మెజారిటీ దాటాలని ఆకాక్షించారు. తెలంగాణలోని లోక్‌సభ స్థానాలన్నింటిలో మెదక్‌ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ రావాలన్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలో పోటీ మనలో మనకే ఉందని కాంగ్రెస్, బీజేపీ పోటీలో లేవన్నారు. అంతా కలిసి పనిచేస్తే కొత్త ప్రబాకర్‌రెడ్డి దేశస్థాయిలో ఇప్పటి వరకు ఉన్న మెజార్టీ రికార్డును బద్ధలు కొట్టగలరని సీఎం చెప్పారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలో సీఎం నియోజకవర్గం సైతం ఉందని, అన్ని నియోజకవర్గాల నాయకులు కలిసి భారీ మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఉండగా మాజీమంత్రి సునీతారెడ్డి మనతో చేరారని.. ఇద్దరూ కలిసి పనిచేస్తే తిరుగే ఉండదన్నారు.

సీఎం అడుగు జాడల్లో ముందుకు సాగుతున్నానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తనకు ఎంపీగా రెండోసారి అవకాశం కల్పించి ఆశీర్వదించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. కారు.. సారు.. సర్కారు నినాదంతో ముందుకు సాగాలని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సూచించారు. పార్టీ కార్యకర్తలు ఎనిమిది రోజుల పాటు కష్టపడి పని చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి, మాజీ మంత్రులు ముత్యంరెడ్డి, సునీతారెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, ఇఫ్కో ఆర్‌జీబీ సభ్యుడు దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీలు సత్యనారాయణ, పారూఖ్‌ హుస్సేన్, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి రాదాకృష్ణశర్మ, మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌యాదవ్,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్,  పార్టీ నాయకులు భూంరెడ్డి,  ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి, సుహాసినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top