కశ్మీర్‌ మన అంతర్గత విషయం కాదా?

Is the Kashmir Is Not Ours? : Shiv Sena - Sakshi

బీజేపీపై శివసేన విసుర్లు

సాక్షి, ముంబై : కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు  యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు ప్రతినిధుల బృందాన్ని అనుమతించడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన కూడా చేరిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో ఇబ్బంది పడ్డ శివసేన ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తోంది. ఇన్నాళ్లూ కశ్మీర్‌ దేశ అంతర్గత సమస్య అంటూ ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను కూడా అడుగుపెట్టనివ్వని ప్రభుత్వం, ఇప్పుడు విదేశీ ప్రతినిధులను ఎందుకు అనుమతినిచ్చిందని బుధవారం ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో నిలదీసింది. ‘కశ్మీర్‌ మనదేనని ఆర్టికల్‌ 370 రద్దు చేశాం. అక్కడ జాతీయ జెండా ఎగురవేశాం. ఈ పరిణామాలతో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాలను చూసి యావత్‌ దేశం గర్వపడింది.

కానీ, కశ్మీర్‌లో అంతా బావుందనే ప్రభుత్వం ఇప్పుడు విదేశీ ప్రతినిధులను ఎందుకు ఆహ్వానించింది? కశ్మీర్‌ మన అంతర్గత విషయం కాదా? ఇది మన స్వేఛ్చపై దాడి కాదా? అంతేకాక, ఈ చర్య కొన్ని సీరియస్‌ ప్రశ్నలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలకు అవకాశమిచ్చింద’ని తీవ్రంగా మండిపడింది. కాగా, మహారాష్ట్రలో 50 : 50 ఫార్ములా ప్రకారం అధికార కాలాన్ని పంచుకోవాలని, పదవుల్లో కూడా చెరిసగం వాటాలుండాలని శివసేన బీజేపీని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే శివసేన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. మంగళవారం ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ.. అలాంటి ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తికి లోనైన శివసేన మరునాడే బీజేపీని విమర్శిస్తూ తన పత్రికలో సంపాదకీయం రాయడం గమనార్హం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top