క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం

Karnataka Floor Test Will Happen Today - Sakshi

సాయంత్ర 6 గంటలకు అసెంబ్లీలో విశ్వాసపరీక్ష

సర్వత్రా ఉత్కంఠ

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగిసేలా కనిపిస్తోంది. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారం రోజు సాయంత్ర 6 గంటలకు ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు, విశ్వాస పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీనికి నిరాకరించిన స్పీకర్‌ నేడు తప్పనిసరిగా బల పరీక్ష నిర్వహించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే సోమవారం రెబల్స్‌  ఎమ్మెల్యేపై స్పీకర్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా వారంత తన ముందు హాజరుకావాలని 16 మంది  సభ్యులకు సమన్లు జారీచేశారు. జేడీఎస్‌, కాంగ్రెస్‌ నేతలు రెబల్స్‌పై అనర్హత వేటు వేయాలని స్వీకర్‌కు చెప్పడంతో ఆయన సమన్లు జారీచేసినట్లు తెలుస్తోంది.

అయితే విశ్వాస పరీక్షపై చర్చ పూర్తయిన వెంటనే బలపరీక్ష ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభానికి నేడో, రేపో తెరపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న వారి అభ్యర్థనకు ధర్మాసనం నిరాకరించింది. విశ్వాస పరీక్షలో తాము జోక్యం చేసుకోలేని స్పష్టం చేస్తూ.. ఇవాళే బలపరీక్ష చేపట్టాలని తాము స్వీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం తేల్చిచెప్పింది.

స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషిన్‌ను రేపు విచారిస్తామని తెలిపింది. ‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే. కాగా విశ్వాస పరీక్షపై గవర్నర్‌ ఇప్పటికే రెండు సార్లు స్పీకర్‌ను లేఖ రాయగా.. వాటిని రమేష్‌ కుమార్‌ ధిక్కరించారు. దీంతో బలనిరూపణపై స్పీకర్‌ తీసుకునే నిర్ణయం కీలకంకానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top