జగన్‌ చరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్‌

K Chandrashekar Rao Congratulates YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అభినందనలు తెలుపుతూ కేసీఆర్‌ ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తెలుగు ప్రజల జీవన గమనంలో ఉజ్వల ఘట్టమని వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ప్రేమాభిమానాలు, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని బలంగా విశ్వసిస్తున్నానని అన్నారు.

ఖడ్గచాలనం కాదు కరచాలనం కావాలి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అంటూ ప్రసంగాన్ని కేసీఆర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్‌ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగల అభినివేశం, శక్తి, సామర్థ్యం ఉందని గత 9 ఏళ్లుగా జగన్‌ నిరూపించారని అన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ముఖ్యమంత్రి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు. వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు కరచాలనం అని పేర్కొన్నారు. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోదావరి జలాలను ఒడిసిపడదాం
వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో గోదావరి జలాల సంపూర్ణ వినియోగం వంద శాతం జరిగి తీరాలని కేసీఆర్‌ అన్నారు. కృష్ణా జలాలను సమస్యలను పరిష్కరించుకుని ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ప్రతి అంగుళం​ సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. దీనికి అవసరమైన అండదండలు, సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని హామీయిచ్చారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి పేరు నిలబెట్టాలని వైఎస్‌ జగన్‌కు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మూడు, నాలుగు టర్మ్‌ల వరకు వైఎస్‌ జగన్‌ పాలన కొనసాగాలని కేసీఆర్‌ కోరుకున్నారు.

సంబంధిత కథనాలు

నవరత్నాలను అమలు చేస్తాం : సీఎం వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌

మీ నాన్న వారసత్వాన్ని కొనసాగించు: ఎమ్‌కే స్టాలిన్‌

వైఎస్‌ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top