బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా! 

JP Nadda Looks Likely To Be Elected As New BJP President - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న అధ్యక్ష పదవికి నామినేషన్లు్ల వేస్తారని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. కేవలం నడ్డా మాత్రమే అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీకి చెందిన 36 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సంస్థాగత ఎన్నికల్లో ఇప్పటికే 21 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయని బీజేపీ సీనియర్‌ నేత రాధా మోహన్‌ సింగ్‌ చెప్పారు. పార్టీ విధివిధానాల ప్రకారం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం సగం స్థానాల్లో ఎన్నికలు పూర్తయితే ఆ పార్టీ దేశ స్థాయి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించవచ్చు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 
వచ్చే నెల 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా 57 స్థానాల అభ్యర్థులను పార్టీ ఢిల్లీ విభాగపు అధ్యక్షుడు మనోజ్‌ తివారీ శుక్రవారం విడుదల చేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మల్యే కపిల్‌ మిశ్రాతోపాటు విజేందర్‌ గుప్తా, మాజీ మేయర్లు రవీందర్‌ గుప్తా, యోగేందర్‌ ఛండోలియాలకు తొలి జాబితాలో చోటు దక్కింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పోటీ చేసేదెవరన్నది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్‌గానే మిగిలిపోయింది.

జాబితాలో మొత్తం 11 మంది ఎస్సీలు కాగా, మహిళా అభ్యర్థులు నలుగురికి చోటు కల్పించారు. కపిల్‌ మిశ్రా మోడల్‌ టౌన్‌ నుంచి, రవీందర్‌ గుప్తా రోహిణి స్థానం నుంచి బరిలోకి దిగుతారని, కేజ్రీవాల్‌పై పోటీ చేసే వ్యక్తిని త్వరలో ప్రకటిస్తామని మనోజ్‌తివారీ తెలిపారు. ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఆమ్‌ఆద్మీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top