మోదీని ఉద్దేశించి సీఎం ట్వీట్‌.. ఆపై డిలీట్‌!

Include Tamil as Optional Language in Other States, Palaniswami Urges Modi - Sakshi

చెన్నై: హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి బోధించాలన్న ప్రతిపాదనపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఒక ట్వీట్‌ చేశారు. ఇతర రాష్ట్రాల్లో తమిళ భాషను ఐచ్ఛీక భాషగా ఎంచుకునే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన తన ట్వీట్‌లో అభ్యర్థించారు. ఈ ట్వీట్‌ తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, అనంతరం పళనిస్వామి తన ట్వీట్‌ను తొలగించారు. 

‘ఇతర రాష్ట్రాల్లో అభ్యసించేందుకు వీలుగా ఆప్షనల్‌ లాంగ్వేజ్‌గా తమిళాన్ని కూడా చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతున్నాను. ఇలా చేయడం ద్వారా ప్రపంచంలో అతి పురాతన భాషల్లో ఒకటైన తమిళానికి గొప్ప మేలు చేసినట్టు అవుతుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.  

హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలంటూ గతవారం విడుదల చేసిన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ప్రతిపాదించడంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. త్రిభాష విద్యావిధానంలో భాగంగా చేసిన ఈ ప్రతిపాదనపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని డీఎంకే వంటి పార్టీలు హెచ్చరించాయి. దాంతో కేంద్రం ముసాయిదాలోంచి ఈ నిబంధనను తొలగించింది. సవరించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను విడుదల చేసింది.

‘ తాము నేర్చుకుంటున్న మూడు భాషల్లో  ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్ధులు 6, 7 గ్రేడుల్లో (తరగతులు) ఆ పని చేయవచ్చు. మాధ్యమిక పాఠశాల బోర్డు పరీక్షల్లో  మూడు భాషల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలిగిన విద్యార్ధులు ఆరు లేదా ఏడు తరగతుల్లో భాషను మార్చుకోవచ్చు.’అని సవరించిన ముసాయిదాలో పేర్కొన్నారు. భాషా నైపుణ్యంపై బోర్డు నిర్వహించే పరీక్షల్లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది.

పళనిస్వామి చేసిన ట్వీట్‌ ఇదే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top