ఐదారు సీట్ల కోసం పడిగాపులా?

Harish rao fires on kodandaram - Sakshi

కోదండరాంపై మంత్రి హరీశ్‌ ధ్వజం

టీఆర్‌ఎస్‌లో చేరిన టీజేఎస్‌ సంగారెడ్డి కార్యదర్శి నగేశ్‌

సాక్షి, హైదరాబాద్‌: కోదండరాంను కేసీఆర్‌ పిలిచి పీట వేసి జేఏసీ చైర్మన్‌ను చేస్తే ఆయనేమో పంగనామాలు పెట్టారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ స్వీయ అస్థిత్వం, స్వరాష్ట్ర సాధన కోసం జేఏసీ ఏర్పాటు చేసి.. దానికి కోదండరాంను చైర్మన్‌ చేసింది కేసీఆరేనని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కోదండరాం ఐదారు సీట్ల కోసం గాంధీభవన్‌ మెట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. కాం గ్రెస్‌ గెలవలేని సీట్లను టీజేఎస్‌కు ఇస్తోందన్నారు.

తెలంగాణ జనసమితి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆత్మకూరు నగేశ్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేత రాంబాబులతో పాటు వారి అనుచరులు తెలంగాణభవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘టీజేఎస్‌ అధినేత కోదండరాంకు తెలంగాణ పౌరుషం పోయింది. ఇప్పుడు అమరావతి, ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు.

వచ్చినట్లే వచ్చి పోయిన తెలంగాణను సాధించుకోవడానికి ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేయాలని కోదండరాం ప్రతిపాదించగానే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఒక్క నిమిషం ఆలోచిం చకుండా పదవులు వదులుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలు చేయకుండా జేఏసీ నుంచే వెళ్లిపోయారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన కోదండరాం ఆ పార్టీని జేఏసీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఉద్యమకారులపై కాంగ్రెస్‌ నేతలు దాడులు చేయించారు’ అని చెప్పారు.

ఆ చరిత్ర కాంగ్రెస్‌దే..
సకల జనుల సమ్మె చేస్తున్న ఉద్యోగులకు 40 రోజు లకు పైగా వేతనాలు ఇవ్వకుండా రాచిరంపాన పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దేనని హరీశ్‌ అన్నారు. ‘జేఏసీ చైర్మన్‌ను చేసి గౌరవించిన టీఆర్‌ఎస్సే ఏమీ కాకుండా పోయింది. కోదండరాం జేఏసీ రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. 2014లో, ఇప్పుడూ కోదండరాం కాంగ్రెస్‌కే దగ్గరగా ఉన్నారు. గత ఎన్నికలప్పుడు కోదండరాం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరు ముగ్గురికి టికెట్లు ఇప్పించుకున్నారు’ అని విమర్శించారు.

కూటమి లక్ష్యమేంటి?
ప్రజాకూటమి లక్ష్యం ఏమిటో కోదండరాం చెప్పాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. ‘తెలంగాణ ద్రోహుల పార్టీలతో ఇప్పుడు కోదండరామే అంటకాగుతుండు. ఆయనను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ ఇంటి పార్టీ నేత చెరుకు సుధాకర్‌పై ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పీడీ యాక్టు కింద కేసు పెట్టి జైలుకు పంపింది. ఆయనకే ఇప్పుడు టికెట్‌ వచ్చే పరిస్థితి లేదు. ఉద్యమకారులకు సముచిత గౌరవం ఇచ్చేది టీఆర్‌ఎస్‌ మాత్రమే. మనకు పరాయిపాలన వద్దు. వంద సీట్లను గెలిచి కేంద్రంలోనూ చక్రం తిప్పుతం. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ భారీ మెజా రిటీతో గెలవడం ఖాయం’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top