తెలంగాణలో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు! | Sakshi
Sakshi News home page

తెలంగాణలో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు!

Published Sat, Jun 30 2018 3:48 PM

GVL Narasimha Rao Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో వాతావరణం చూస్తే నాలుగు రోజుల్లోనే ఎన్నికలు వస్తాయా అన్నట్టుగా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లా దుబ్బాకలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విప్లవం కోసం ఎదురుచూసినట్టుగా సభకు వచ్చిన ప్రజలు టీఆర్‌ఎస్‌ను గద్దెదించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న జన చైతన్య యాత్రకు ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పట్టుకుందని, 2019లో జరిగే ఎన్నికల్లో ఆ చంద్రగ్రహణం వీడనుందని అన్నారు.

కుటుంబ పాలన సాగిస్తున్న ఇ‍ద్దరు సీఎంలు, అభివృద్ధి గాలికొదిలేసి కొడుకులను సీఎం చేయాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్లు ఇస్తే ఇంకా అప్పులు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగు వేలమంది  రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. 

ఆత్మహత్యలో మెదక్‌ జిల్లా మొదటి స్థానం
మెదక్‌ జిల్లా అభివృద్ధిలో ముందుందని కేసీఆర్‌ ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అభివృద్ధి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి విమర్శించారు. రైతుల ఆత్మహత్యలో మెదక్‌ జిల్లా మొదటి స్థానంలో ఉందని, సీఎం మాత్రం తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తున్నాని ఆరోపించారు. ఉద్యమాలు, ధర్నాలు చేయకుండా ప్రభుత్వం నిర్భధిస్తోందని మండిపడ్డారు.  తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement