
అహ్మదాబాద్: ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలిచ్చింది. ‘జనవరి మూడో వారంలో రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. ఇందుకోసం డిసెంబర్‌లో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాన ఎన్నికల అధికారి ఏకే జోతి వెల్లడించారు.
అయితే ఎన్నికలకు సంబంధించిన ఇతర విషయాలు వెల్లడించేందుకు నిరాకరించారు. తొలిసారిగా గుజరాత్ వ్యాప్తంగా ఓటరు ధ్రువీకరణ పత్రాలున్న ఓటింగ్ యంత్రాలతోపాటుగా నియోజకవర్గానికి కనీసం ఒక్కటైనా పూర్తి మహిళా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై యోచిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్‌లో ఎన్నికల సంసిద్ధతను పరీక్షించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఇటీవలే రాష్ట్రమంతా పర్యటించారు.