గవర్నర్ హామీ ఇచ్చారు: కుమారస్వామి

Governor Assured That Action As Per Constitution, Says Kumaraswamy - Sakshi

సాక్షి, బెంగళూరు: తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి గవర్నర్ వజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను కోరారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు. ఆ మేరకు ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన లేఖను వజుభాయ్‌కి కుమారస్వామి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నిర్ణయం తర్వాతే తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. రాజ్యాంబద్దంగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వివరించారు. కుమారస్వామితో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర కూడా భేటీలో పాల్గొన్నారు. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో చర్చించారు.

గవర్నర్‌పై నమ్మకం ఉంది
రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు గవర్నర్‌పై నమ్మకం ఉందని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మా నుంచి ఒక్క నేత కూడా ఇతర పార్టీలోకి వెళ్లలేదు. గవర్నర్ అన్యాయం చేయరని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భావిస్తోందని ఆయన చెప్పారు.

తొలుత అడ్డగింత.. ఆపై భేటీ
తొలుత రాజ్‌భవన్‌లోకి కాంగ్రెస్, జేడీఎస్ నేతలను సిబ్బంది అనుమతించకపోవడంతో కొంత సమయం అక్కడ ఉద్రిక్త చోటుచేసుకుంది. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అయితే గవర్నర్ అనుమతించాక కుమారస్వామి, పరమేశ్వర రాజ్‌భవన్‌లో ఆయనతో చర్చించారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. గవర్నర్‌కు లేఖను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ధర్నా చేపడతామని తెలిపారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సైతం వెనుకాడేది లేదని ఈ కూటమి నేతలు అంటున్నారు.      

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top