‘పవన్‌ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని’

Government Whip Fires On Pawan Kalyan In Amravati - Sakshi

సాక్షి, అమరావతి : విపక్షాలు ప్రతిరోజు ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతన్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం ప్రభుత్వ విప్‌లు సమావేశమయ్యి చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రతి బుధవారం ఈ తరహా సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండాలన్నదే ప్రతిపక్షాల  ప్రయత్నమని శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు.

ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉంది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నవంబర్‌ 6నే మొదలుపెట్టి పూర్తి చేశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుర్తు చేశారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తున్న రోజే ఈనాడు పత్రికలో ఇసుక కొరత, నిర్మాణ రంగంపై కథనం వచ్చిందని, దాన్ని అనుసరించే ఇసుక అవినీతిని అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చంద్రబాబు ఇసుకపై  చేసే దీక్షకు విలువ ఉండదని, ఇసుక విషయంలో ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉందని స్పష్టం చేశారు.

ప్రతి బుధవారం పార్టీ కోర్‌ కమిటీ సమావేశమయ్యి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా వివిధ అంశాలు చర్చిస్తుందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పేర్కొన్నారు. ఇసుక వల్ల తలెత్తిన ఇబ్బందిని సరిచేస్తామన్నారు. చంద్రబాబు ఇసుక కోసం చేసే దొంగ దీక్షలను ప్రజలు హర్షించరని దుయ్యబట్టారు. విశాఖలో పవన్‌ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని అని, కొందరు పిచ్చి వాళ్లను పిలిచి చేతులు ఊపితే సరిపోదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాన్‌ను హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top