మూకదాడిపై గంభీర్ ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

మూకదాడిపై గంభీర్ ఆగ్రహం!

Published Mon, May 27 2019 1:40 PM

Gautam Gambhir Fires on Gurugram Mob Attack - Sakshi

న్యూఢిల్లీ : జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్‌లో అల్లరిమూకలు చేసిన దాడిపై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఈ ఘటనపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘టోపీ తీయమని, జైశ్రీరాం నినాదం చేయమని అల్లరి మూకలు జరిపిన దాడి అత్యంత దారుణం. గురుగ్రామ్‌ అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మనమంతా సెక్యులర్‌ దేశంలో బతుకుతున్నాం. నరేంద్రమోదీ మంత్రం సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌తో నాకు సెక్యులరిజంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఒక్క గురుగ్రామ్‌ ఘటనపై మాత్రమే కాదు.. కులం, మతం పేరిట జరిగే దాడులన్నిటిపై నేను గళం ఎత్తుతా’ అని ట్వీట్‌ చేశారు.

నమాజ్‌కు వెళ్లివస్తున్న మహ్మద్‌ బార్కర్‌ అలామ్‌ (25)పై టోపీ ధరించాడని, జైశ్రీరాం అనలేదని నలుగురు దుండగులు దాడి చేశారు. బిహార్‌కు చెందిన అలామ్‌.. హర్యానాలోని గురుగ్రామ్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక తూర్పు ఢిల్లీ నుంచి గంభీర్‌ బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.

చదవండి: ‘జైశ్రీరాం’ అనాలని చితక్కొట్టారు!

Advertisement
Advertisement