లక్కీ లష్కర్‌

G Kishan Reddy in Narendra Modi Cabinet - Sakshi

మోదీ కేబినెట్‌లో సికింద్రాబాద్‌ ఎంపీ  

శివశంకర్, అంజయ్య, దత్తాత్రేయ బాటలో కిషన్‌రెడ్డి

నగర బీజేపీ కార్యకర్తల్లో నయా జోష్‌

సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర రాజకీయాల్లో గురువారం లష్కర్‌ (సికింద్రాబాద్‌) మరో కొత్త చరిత్రను లిఖించింది. ఈ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన జి.కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎక్కువ మంది కేంద్ర మంత్రులను అందించిన నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడి నుంచి 1979, 80లో ఎంపీగా ఎన్నికైన పి.శివశంకర్‌.. ఇందిరాగాంధీ, రాజీవ్‌ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాలు, న్యాయ, పెట్రోలియంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1984లో ఇక్కడి నుంచే గెలిచిన టి.అంజయ్య రాజీవ్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1991, 1998, 99లో ఎంపీగా ఎన్నికైన దత్తాత్రేయ.. వాజ్‌పేయి మంత్రివర్గంలో అర్బన్‌ డెవలప్‌మెంట్, రైల్వే శాఖ సహాయ మంత్రిగా, 2014లో మోదీ కేబినెట్‌లో కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగాను దత్తాత్రేయ పనిచేశారు. తాజాగా మోదీ నూతన కేబినెట్‌లో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి అవకాశం లభించింది.

కిషన్‌రెడ్డి వెరీ స్పెషల్‌
వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికకావటంతో పాటు, ఎంపీగా ఎన్నికైన తొలిసారే కేంద్ర కేబినెట్‌లో చోటుదక్కిన సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డి రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచారు. ఈయన 2004లో హిమాయత్‌నగర్, 2009, 2014లో అంబర్‌పేట శాసనసభ స్థానం నుంచి విజయం సాధించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం రావడం నగర రాజకీయాల్లో అరుదైన అంశంగా ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. అయితే, 1989లో గోషామహల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండారు దత్తాత్రేయ ఓటమి పాలై మళ్లీ శాసనసభకు కాకుండా వరసగా లోక్‌సభకే పోటీ చేస్తూ వచ్చారు. కిషన్‌రెడ్డి సైతం 1999లో కార్వాన్‌ శాసనసభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలోనూ జాతీయ యువజన విభాగం అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేఎల్పీ నాయకుడిగా దాదాపు అన్ని హోదాల్లోనూ పనిచేశారు.

పార్టీ నగర నేతల్లో ఆనందం
కేంద్ర క్యాబినెట్‌లో ఎంపీ కిషన్‌రెడ్డికి స్థానం దక్కడంపై నగర బీజేపీ నేతలు గురువారం హర్షం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లో నగరంలో భారీ సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. కిషన్‌రెడ్డికి కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కడంపై మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థులు బి.జనార్దన్‌రెడ్డి, రామచంద్రరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top